బంజారాహిల్స్, జనవరి 26: క్యాన్సర్‌పై పోరాటాన్ని ముందు కు తీసుకెళ్తానని ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణుడు, పద్మభూషణ్ అవార్డుగ్రహీత డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అన్నారు. దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు తాను అందుకున్నానని, అయితే వాటన్నింటిలో పద్మభూషణ్ అవార్డు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేళ భారత ప్రభుత్వం నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన సందర్భంగా సోమవారం బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ దవాఖానాలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణతోపాటు పలువురు క్యాన్సర్ వైద్యులు, విద్యార్థులు, నోరి దత్తాత్రేయుడిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధికి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటం, సేవలు గుర్తించి భారత ప్రభుత్వం, ప్రజలు అందించిన పద్మభూషణ్ పురస్కారం ఎంతో ప్రత్యేకమైనదని తెలిపారు. రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ర్టాల్లో క్యాన్సర్‌పై పోరాటాన్ని మరింత సమర్థంగా సాగించేందుకు ఈ అవార్డు స్ఫూర్తిని రగిలించిందని పేర్కొన్నారు. కొన్ని రకాల క్యాన్సర్లను ప్రారంభంలోనే గుర్తిస్తే నివారించవచ్చని తెలిపారు. ఈ దిశగా కృషి చేసేందుకు రోడ్ మ్యాప్ రూపొందించి రెండు రాష్ర్టాల సీఎంలకు ఇవ్వగా, అమలు పర్చేందుకు అంగీకరించారని వివరించారు.