హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ ( Mahatma Gandhi ) పేరు తొలగించడం సరైనది కాదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ( Boinapalli Vinod Kumar ) అన్నారు. 20 సంవత్సరాల క్రితం 2005లో వచ్చిన ఉపాధి హామీ చట్టం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చాలా మార్పులు వచ్చాయన్న కారణంతో చట్టాన్ని మెరుగుపరచడానికి మార్పులు చేయడమనేది అవాస్తమని ఆరోపించారు.
ఈ చట్టం స్థానంలో వీబీ జీ రామ్ జీ తీసుకొచ్చిందని, గతంలో నరేగా కింద కేంద్ర ప్రభుత్వం 90 శాతం ,10శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాయని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించాలని నిబంధన పెట్టడం శోచనీయమని అన్నారు.
పని హక్కును ప్రాథమిక హక్కు కావాలని చేసిన పోరాటాలతో పార్లమెంట్ లో చట్టం వచ్చినప్పుడు తామంతా మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. ఈప్రాథమిక హక్కును నరేంద్ర మోదీ ప్రభుత్వం నీరుగార్చిందని ఆరోపించారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తేనే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని నిబంధన అసంబద్ధంగా ఉందని అన్నారు.
ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలు,ఈశాన్య రాష్ట్రాలు మెరుగుగా లేవని, ఆ రాష్ట్రాలు 40శాతం నిధులు ఇవ్వలేవని పేర్కొన్నారు. ఆ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం పేదరికాన్ని పెంచే అవకాశం ఉందని వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కీంలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని తెలిపారు.
రానున్న రోజుల్లో ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసి , రద్దు చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. నరేగాతో దేశంలో 8.9 కోట్ల మంది ప్రజలు జాబ్ కార్డులు పొంది గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్నారని , ఈ పథకాన్ని రద్దు చేస్తే వీరందరికీ నష్టం జరుగుతుందని వినోద్ కుమార్ తెలిపారు.