కరీంనగర్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహదేవపూర్ డివిజన్-1లో డీఈఈగా కొనసాగుతూనే.. మహదేవపూర్ డివిజన్-2కు ఫుల్ అడిషనల్ ఈఈగా కొనసాగుతున్న సూర్యప్రకాశ్‌ను ప్రభుత్వం ఎట్టకేలకు తొలగించింది. ఆయన స్థానంలో రమేశ్‌బాబును నియమించింది.
ఈ మేరకు తాజాగా నీటిపారుదలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలో తప్పులు దొర్లిన విషయం గతంలోనే బహిర్గతం కాగా.. రిపోర్టులో నలుగురు అధికారులను తప్పించిన వైనాన్ని ‘విజిలెన్స్ రిపోర్ట్.. కరప్ట్?’ శీర్షికతో ఇటీవల ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ప్రత్యేక కథనం ద్వారా బయటపెట్టింది. కథనంలో పేర్కొన్న అంశాలు నిజమేనని నిర్ధారించుకున్న ఉన్నతాధికారులు… నలుగురు అధికారులను తప్పించడం వెనుక రూ.2 కోట్ల డీల్ జరిగినట్టు గుర్తించారని విశ్వసనీయ సమాచారం. నలుగురు అధికారుల్లో డీఈఈ సూర్యప్రకాశ్ ఒకరు.
ఈయన కన్నా తక్కువ బిల్లులు రికార్డు చేసిన ఇంజినీర్లపై కేసులు పెట్టిన విజిలెన్స్.. ఈ అధికారిని మాత్రం తప్పించడమే చర్చనీయాంశంగా మారింది. సీనియర్ అధికారులు వందలాది మంది ఉన్నా.. వారందరినీ పక్కన పెట్టిమరీ సూర్యప్రకాష్‌కు మహదేవపూర్ డివిజన్-2 ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించడం కొసమెరుపు. ఈ అంశాన్ని కూడా ‘నమస్తే తెలంగాణ’ కథనంలో ప్రస్తావించింది. ఉన్నతాధికారులు స్పందించి, సూర్యప్రకాశ్‌ను అదనపు బాధ్యతల నుంచి తప్పించారు.