హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసు ఘటనలో డిబార్ అయిన విద్యార్థికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 10, 11న నిర్వహించే పరీక్షలకు అనుమతించాలని విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది. ఇటీవల హన్మకొండ జిల్లా కమలాపూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.
ఈ ఘటన కేసులో బాధిత విద్యార్థిని ఉన్నతాధికారులు ఐదేండ్ల పాటు డిబార్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థి తండ్రి రాజు హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన కొడుకు రెండు పరీక్షలకు హాజరయ్యేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని రాజు తరఫు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణను 24కు వాయిదా వేసింది.