హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం బాచుపల్లిలో అంబీర్ చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణకు ముందు శ్రీసాయి కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సమర్పించిన అభ్యంతరాలను పరిశీలించాలని, ఆ తర్వాత చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు నీటిపారుదల శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ సొసైటీ సమర్పించిన అభ్యంతరాలు ఎఫ్టీఎల్ నోటిఫికేషన్‌కు అడ్డంకి కాబోవని, ఒకవేళ అక్కడ పట్టా భూములు ముంపునకు గురైతే పరిహారం పొందవచ్చని స్పష్టం చేసింది. బాచుపల్లి సర్వే నంబర్ 171లోని భూమిని అంబీర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధి తప్పించాలన్న వినతి పత్రాన్ని పరిశీలించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో శ్రీసాయి కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.