Yellampalli Project | హైదరాబాద్, ఫిబ్రవరి19 (నమస్తే తెలంగాణ): శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ సీజన్‌కు సరిపడా నీళ్లు లేవని, కాబట్టి కడెం ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 11 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ 3.30 టీఎంసీలను మినహాయిస్తే ఇక వినియోగానికి అందుబాటులో ఉన్నవి ఏడు టీఎంసీల కంటే తక్కువే. ఈ ప్రాజెక్టు నుంచే హైదరాబాద్‌కు, ఎన్టీపీసీకి, రామగుండం ఫర్టిలైజర్స్తోపాటు పలు జిల్లాలకు మిషన్‌భగీరథ నీటిని సరఫరా చేయాల్సి ఉన్నది.
ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పడిపోతున్నది. దాదాపు వారానికి ఒక టీఎంసీ చొప్పున ఖాళీ అవుతున్నది. దీంతో మిషన్ భగీరథకు అవసరమైన నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో మిషన్ భగీరథ నీటి సరఫరాకు కావాల్సిన నీటి లెవల్ మెయింటనెన్స్ కోసం ఎగువన కడెం నుంచి ఎల్లంపల్లికి నీటిని విడుదల చేయాలని అధికారులు కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 7 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 3.57 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ 2.5 టీఎంసీలు. కడెం ప్రాజెక్టు కింద ఈ ఏడాది క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి క్రెస్ట్ లెవల్ వరకు ఉన్న నీటిని దిగువకు విడుదల చేయాలని ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు కోరుతున్నారు.