హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్‌కు ఈ ఏడాది సిలబస్‌ను 30% తగ్గించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లోని 70% సిలబస్ నుంచే ప్రశ్నలిస్తారు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్‌లో ఉన్న విద్యార్థులంతా ఫస్టియర్‌లో 70% సిలబస్‌నే అభ్యసించారు. సెకండియర్‌లోనూ 70% సిలబస్‌నే చదువుతుండటంతో ఆ ప్రకారమే ఎంసెట్‌ను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) ఆధ్వర్యంలో జూలై 14 నుంచి నిర్వహించే ఈ పరీక్షకు తెలంగాణలోని 18, ఏపీలోని 5 జోన్లలో 105 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పరీక్షకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు రూ.400, ఇతర క్యాటగిరీల విద్యార్థులు రూ.800 ఫీజు చెల్లించాలని గోవర్ధన్ వెల్లడించారు. రెండు (అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ఇంజినీరింగ్) పరీక్షలూ రాయదల్చుకొంటే ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు రూ.800, ఇతర క్యాటగిరీల విద్యార్థులు రూ.1,600 ఫీజు చెల్లించాలని, దరఖాస్తు సహా ఇతర వివరాల కోసం https://eamcet.tsche. ac. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.
కోర్సులివే..
బీఈ, బీటెక్, బీటెక్ (బయోటెక్నాలజీ), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), బీఫార్మసీ/బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ ఆనర్స్, అగ్రికల్చర్/బీఎస్సీ (ఆనర్స్), హార్టికల్చర్/బీఎస్సీ (ఫారెస్ట్రీ)/బీవీఎస్సీ/బీఎఫ్ఎస్సీ అండ్ ఏహెచ్/బీఎఫ్ఎస్సీ/ఫార్మా-డీ.
ఆ నిబంధన నుంచి మళ్లీ మినహాయింపు
ఎంసెట్ రాసేందుకు ఇంటర్లో కనీస మార్కులు సాధించాలన్న నిబంధన నుంచి ఈ ఏడాది కూడా మినహాయింపు ఇవ్వనున్నారు. ఇంటర్ పాసైనవారందరినీ ఎంసెట్‌కు అనుమతించనున్నారు. నిబంధనల ప్రకారం ఎంసెట్‌కు హాజరవ్వాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో జనరల్ క్యాటగిరీ విద్యార్థులు కనీసం 45%, రిజర్వుడు క్యాటగిరీ విద్యార్థులు 40% మార్కులను సాధించాల్సి ఉంటుంది. కానీ కరోనా నేపథ్యంలో నిరుడు ఇంటర్ ఫస్టియర్‌లో 51% మంది విద్యార్థులు ఫెయిలవడంతో వారికి 35% మార్కులేసి పాస్ చేసిన విషయం విదితమే. దీంతో ఇంటర్లో పాస్ మార్కులు వచ్చినవారిని ఎంసెట్‌కు అనుమతించాలని ఎంసెట్ టెస్ట్ కమిటీ నిర్ణయించింది. దీనిపై ఉన్నత విద్యామండలి అధికారులు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉన్నది.
ఇంటర్ వెయిటేజీ లేనట్టే
నిరుడు మాదిరిగా ఈ ఏడాది కూడా ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వం త్వరలో జీవో జారీచేసే అవకాశాలున్నాయి. గతంలో ఇంటర్ మార్కులకు 25%, ఎంసెట్ మార్కులకు 75% వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటించేవారు.
టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల
పాలిటెక్నిక్, బీఎస్సీ (గణితం) పూర్తిచేసిన వారికి బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ (ద్వితీయ సంవత్సరంలో) ప్రవేశాలకు తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ ఈసెట్) నోటిఫికేషన్ విడుదలైంది. 2022 -23 సంవత్సరం ప్రవేశాలకు గాను ఈ నోటిఫికేషన్‌ను టీఎస్ ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఈ సెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూకు అప్పగించారు. జూలై 8న హాల్ టికెట్ల డౌన్లోడింగ్, 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తులను ఏప్రిల్ 6 నుంచి జూన్ 8 వరకు స్వీకరిస్తామని విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు రూ. 400, ఇతరులు రూ.800 ఫీజుగా చెల్లించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.ecet.tsche.ac.in సంప్రదించాలని ఆయన కోరారు.
