హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటాలోని రెండు స్థానాల భర్తీకి గురువారం నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఎమ్మెల్సీలుగా ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరిలు రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల నాలుగో తేదీన షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. షెడ్యూల్లో పేర్కొన్నట్టు గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర శాసనసభలో ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డి నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
ఒక స్థానానికి తెల్లరంగు బ్యాలెట్, మరోదానికి గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను ఎన్నికల కోసం వినియోగించాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 19వ తేదీన నామినేషన్ల పరిశఋలన చేయనున్నారు. 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీగా నిర్ణయించారు. ఈ నెల 29న ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ను నిర్వహించనున్నారు. అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ల నుంచి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆ పార్టీలు ఎవరిని బరిలో దించుతాయన్న దానిపై స్పష్టత రాలేదు. రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెల్చుకునే బలం ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఏయే పార్టీలు పోటీలో ఉంటాయో తేలిపోనున్నది. ఒకవేళ ఒక్క పార్టీ అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉంటే వారే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు.