లింగాలఘనపురం, జూన్ 5: జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నేలపోగులకు చెందిన ఎన్నారై కేసరి లక్ష్మీనారాయణ తాను పుట్టిన ఊరి రుణం తీర్చుకొంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వగ్రామమైన నేలపోగులను దత్తత తీసుకొన్న ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తనవంతుగా సాయపడుతున్నారు. గ్రామంలో పాఠశాల భవన పునర్నిర్మాణానికి ముందుకొచ్చారు. 2001-02లో రూ.1.50 లక్షలతో ఎకరన్నర స్థలాన్ని సమకూర్చారు. అప్పడు ప్రభుత్వం ఓ తరగతి గదిని నిర్మించింది.
తర్వాత ప్రభుత్వం 30 శాతం నిధులు కేటాయించగా, లక్ష్మీనారాయణ మరో రూ.60 వేలతో గది నిర్మాణం పూర్తిచేశారు. రూ.5.50 లక్షలతో పాఠశాలలో తరగతి గదులు, రూ.10 లక్షలతో డైనింగ్ హాల్ కట్టించారు. రూ.15 లక్షలతో ప్రహరి నిర్మించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా మరో రూ. 20 లక్షలు పాఠశాల అభివృద్ధికి వెచ్చించారు. దీంతో ప్రభుత్వం అతడి భార్య పేరిట ‘రత్నమాల కేసరి ప్రాథమికోన్నత పాఠశాల’గా నామకరణం చేసింది. ప్రస్తుతం రూ.60 లక్షలతో మరో అంతస్తు నిర్మిస్తున్నారు.
ఇందులో ఓ గదిలో లైబ్రరీ, సైన్స్ల్యాబ్, 150 మందికి అనుకూలంగా ఉండేలా సెమినార్ హాల్ కడుతున్నారు. తోటమాలి, వాచ్మన్, అటెండర్ను నియమించి వేతనాలు అందిస్తున్నారు. రూ.2 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రూ.15 లక్షలతో పదేండ్ల నుంచి గ్రామస్థులకు శుద్ధి నీటిని అందిస్తున్నారు. శివాలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వగా, మరో రూ.40 లక్షలతో పనులు చేయిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నత విద్యను పూర్తి చేసిన లక్ష్మీనారాయణ అమెరికాలో కాలుష్య నివారణ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. లక్ష్మీనారాయణ సేవాభావాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.