నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 25 : రజక, నాయీబ్రాహ్మణులకు ప్రతి నెలా అందిస్తున్న ఉచిత విద్యుత్తు పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లను విడుదల చేయడం పట్ల ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
శనివారం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ.. 2022 సెప్టెంబర్ నుంచి పెండింగ్‌లో ఉన్న రజకుల ఉచిత విద్యుత్తు బకాయిలను డిస్కమ్‌లకు జమ చేయడం సంతోషకరమన్నారు. అలాగే రజక, నాయీబ్రాహ్మణుల ఫెడరేషన్లకు రూ.25 కోట్ల చొప్పున కేటాయించడం శుభపరిణామమన్నారు. నిధుల విడుదలకు సహకరించిన మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.