హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): స్టాఫ్‌నర్స్ పోస్టుల తుది ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెమెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్సార్బీ) ఆదివారం విడుదల చేసింది. ఎంపికైన వారి జాబితాను ఎంహెచ్ఎస్సార్బీ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. మొత్తం 7,094 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టు పేర్కొన్నది. వీరికి ఈ నెల 31న నియామక పత్రాలు అందజేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఎల్బీస్టేడియంలో భారీ ఎత్తున సభ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు ప్రభుత్వం 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9 విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. సుమారు 40 వేల మందికిపైగా ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. వీరికి నిరుడు జూలైలో ప్రభుత్వం ఆన్లైన్లో పరీక్ష నిర్వహించింది. తుది ఫలితాలు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియకు తాత్కాలిక ఆటంకం ఏర్పడింది.
కొత్త ప్రభుత్వంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాల మేకు మరో 1,890 పోస్టులను ప్రభుత్వం జత చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కు పెరిగింది. గత నెలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన మెరిట్ లిస్ట్ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. మెరిట్ లిస్ట్ తప్పుల తడకగా ఉన్నదంటూ కొంత మంది అభ్యర్థులు కోఠిలోని మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు వద్ద ఆందోళన చేపట్టారు. తకువ మారులు వచ్చిన వారి పేర్లు జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. నార్మలైజేషన్‌పై, వెయిటేజీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు అభ్యర్థులు కోర్టును సైతం ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బోర్డు అధికారులు ప్రత్యేకంగా అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు తీసుకొన్నారు. అందరికీ సమాధానాలు ఇచ్చారు. దీంతో నియామకాలకు అడ్డంకులు తొలగినట్టయింది.
‘ఆఫీసర్’గా గుర్తించండి
స్టాఫ్‌నర్స్‌లను ‘నర్సింగ్ ఆఫీసర్స్’గా హోదా మార్చుతూ ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో ఉత్తర్వులిచ్చింది. సీనియారిటీ ప్రకారం వివిధ హోదాలు కేటాయించింది. ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో రికార్డుల్లో పేరు మార్పు జరుగలేదు. ఈ నేపథ్యంలో పాత వారికి రికార్డుల్లో హోదా మార్పుతోపాటు.. కొత్తగా నియామక పత్రాలు అందించబోయే 7,094 మందికి ‘నర్సింగ్ ఆఫీసర్’గా గుర్తింపు ఇవ్వాలని నర్సులు, అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
స్టాఫ్ నర్సులుగా ఎంపికైన అన్నాచెల్లె ఒకే ఇంట్లో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు
ఆ అన్నాచెల్లెళ్లు.. ఒకేసారి, ఒకేపరీక్ష ద్వారా స్టాఫ్ నర్సులుగా ఎంపికయ్యారు. తన ఇద్దరు పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్‌కు చెందిన విజ్జిగిరి రాజకనుకయ్య-కోమల దంపతులకు కొడుకు విజ్జిగిరి కుమారస్వామి, కూతురు విజ్జిగిరి శిరీష ఉన్నారు. వారి తండ్రి కొన్నేండ్ల కిందట అనారోగ్యంతో మరణించాడు. తల్లి కోమల తమకున్న కొద్దిపాటి భూమిని సాగుచేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివించింది. 2022 మార్చిలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ స్టాఫ్ నర్స్‌ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా ఆ అన్నాచెల్లెళ్లు దరఖాస్తు చేశారు. ఆరు నెలల క్రితం నిర్వహించిన సీబీటీ ఆన్లైన్ ఎక్జామ్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) రాశారు. ఆదివారం సాయంత్రం ఫలితాలు వెలువడగా వీరిద్దరూ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిని గ్రామస్థులు అభినందించారు.