హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వం జూనియర్ కాలేజీలలో 14 ఏండ్ల సంవత్సరాల తర్వాత జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక కీ కూడా విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కూడా స్వీకరించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యి దాదాపు ఐదు నెలలు గడిచింది. అయినప్పటికీ కూడా జూనియర్ లెక్చరర్ల భర్తీ ప్రక్రియ అడుగు ముందుకుపోవడం లేదని బాధిత జేఎల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంపై టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని సంప్రదించిన బాధిత అభ్యర్థులకు వారంలో ఫలితాలు విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. హెల్ప్‌లైన్ ద్వారా సంప్రదించిన కూడా ఇదే అంశాన్ని చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేఎల్ ఫలితాలు విడుదలపై టీఎస్పీఎస్సీ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నట్టు జేఎల్ బాధిత అభ్యర్థి ప్రకాశ్ తెలిపారు.