హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): జేఎన్టీయూలో (JNTU) తమకు అన్యాయం జరుగుతున్నదని రెగ్యులర్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చాలాకాలంగా పని చేస్తున్న తమ సేవలను విస్మరించి, ప్రభుత్వంలోని ఇతర శాఖలలో ఉద్యోగ విరమణ చేసిన వారిని వర్సిటీలో అందలం ఎక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. యూనివర్సిటీలో డైరెక్టర్ పోస్టులను ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులతో భర్తీ చేయడం విడ్డూరమని ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనర్హులను బయటకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మార్చిలో జారీ చేసిన జీవోను అధికారులు అమలు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్, మినిస్టీరియల్ ఫోర్త్క్లాస్ ఎంప్లాయిస్ అసోసియేషన్, యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం, ఎస్సీ, ఎస్టీ బోధనేతర ఉద్యోగుల సంఘం నేతలు యూనివర్సిటీ ఉన్నతాధికారులకు వినతి పత్రం అందచేశారు. ఇటీవల పీజీలు, పీహెచ్డీలు పూర్తి చేసిన వారిని విస్మరించి, ఎప్పుడో 40 ఏండ్ల క్రితం ఇంజినీరింగ్ చదివిన వారికి పదవులు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. యూనివర్సిటీ ఫైనాన్స్ ఆఫీసర్గా రిటైరైన ఆర్టీసీ ఉద్యోగిని నియమించడం దారుణమని మండిపడుతున్నారు.
కనీసం రెండేండ్లు సర్వీసు ఉండాలి
నిబంధనల ప్రకారం, కనీసం రెండేండ్ల సర్వీసు ఉన్న వాళ్లను మాత్రమే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పద్ధతిలో తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. కానీ, జేఎన్టీయూలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగిని ఫైనాన్స్ అధికారిగా నియమించడమేంటని నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై వర్సిటీ వీసీ, అధికారులు స్పందించకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. మరోవైపు డైరెక్టర్ నియామకాలలో ఎలాంటి తప్పులు జరుగడం లేదని, సక్రమంగానే పోస్టులు భర్తీ చేస్తున్నామని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. నిబంధనలకు నీళ్లొదిలి.. సమర్థించుకోవడం సబబు కాదని, సమగ్ర విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.