హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవలు మరోసారి స్థంభించాయి. స్టేట్ డాటా సెంటర్లోని మెయిన్ సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా 143 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో శుక్రవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లతోపాటు ఇతర సేవలన్నీ నిలిచిపోయాయి. అధికారిక వెబ్సైట్ పనిచేయకపోవడంతో ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్ చేసుకొని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చిన ప్రజ లు ఎండలో నానా అవస్థలు పడాల్సి వచ్చింది.
గచ్చిబౌలిలోని స్టేట్ డాటా సెంటర్లో తలెత్తిన సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల్లోగా అవెబ్సైట్ను పునరుద్ధరిస్తామని చెప్పిన నిపుణులు రాత్రి 7.30 తర్వాత సర్వర్‌ను పునరుద్ధరించినట్టు చెప్పారు. శుక్రవారం రిజిస్ట్రేషన్లు పూర్తికాని వారు శనివారం నేరుగా వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని చెప్పారు.