హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఓట్ల నమోదును ఎన్నికల సంఘమే చేపట్టాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ సూచించింది. రాజకీయ పార్టీలకు బాధ్యత అప్పగిస్తుండడంతో పూర్తిస్థాయిలో ఓటర్ల నమోదు జరగడం లేదని పేర్కొంది. బుధవారం బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాధారణ ఓటర్ల జాబితా ప్రక్షాళన, గ్రాడ్యుయేట్ ఓట్ల నమోదు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు దూదిమెట్ల బాలరాజుయాదవ్, రాకేశ్‌కుమార్, పల్లె రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలరాజుయాదవ్ పలు సూచనలు చేశారు. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును ఎన్నికల సంఘమే చేపట్టాలని కోరారు.
ప్రజాపాలన దినంగా సెప్టెంబర్ 17
హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాకేంద్రాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించనున్న ప్రజాప్రతినిధుల పేర్లను ఖరారు చేశారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. జిల్లాల్లో మంత్రులు, స్పీకర్, మండలి చైర్మన్ పతాకావిష్కరణ చేస్తారు.