శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 01:58:06

అద్దగంటల ఒడిశె

అద్దగంటల ఒడిశె

ఏండ్ల తరబడి భూ సమస్యలతో సతమతవుతున్న తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు న్యాయం చేయాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టానికి శ్రీకారం చుట్టారు. అవినీతికి తావులేకుండా, రెవెన్యూ సేవలు పారదర్శకంగా ప్రజలకు అందాలనే లక్ష్యంతో ధరణి పోర్టల్‌ అందుబాటులోకి తీసుకొచ్చి, దాని ద్వారానే భూ క్రయవిక్రయాలు జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తున్నది. కొత్త రెవెన్యూ చట్టం, ధరణి సేవలపై గ్రామాల్లో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లాలోని ఓ గ్రామంలో కొంతమంది రైతుల మధ్య జరిగిన సంభాషణ ఈ విధంగా ఉంది.

పొద్దుగాల ఐదు గంటలకు బాయికాడికి పోయేముందు మూడుబాటల కాడ ఉన్న తెలంగాణ గద్దె(టీఆర్‌ఎస్‌ పార్టీ దిమ్మె) పక్కన రామయ్య అనే రైతు చలికి మోదుగ సుట్టను నోట్లో పెట్టుకొని గప్పుగప్పున పీల్చుతున్నడు. గప్పుడే మల్లయ్య అనే రైతు తెలంగాణ గద్దె మీద కూసున్న రామయ్య దగ్గరికి వచ్చి ముచ్చట షురూ చేసిండు..

మల్లయ్య: ఏమే! రామన్న వరి కోశినవా?

రామయ్య: కోశిన మొన్ననే, వడ్ల సెంటర్‌లో గూడా అమ్ముకచ్చిన. ఇయ్యాల రేపట్ల బ్యాంకుల పైసలు పడ్తయ్‌.

మల్లయ్య: మొన్న టిక్‌టాక్‌గా తయారై ఆటోలో ఎటో పోతివి?

రామయ్య: గా ముచ్చటా, మొన్న చెరువు కింద గా కాపోల్ల బాపతి జాగ తీసుకుంటి గద. దాన్ని పట్టా చేసుకునేందుకు మండలాఫీసుకు పోయిన.

(గప్పుడే రామయ్య, మల్లయ్యల దగ్గరికి రాజబ్రహ్మం యాప పుల్ల నోట్లేసుకొని పళ్లు తోముకుంటూ వచ్చిండు)

రాజబ్రహ్మం: ఏం రామయ్య బావ.. మా మల్లన్నతోటి బాగ ముచ్చట పెడుతున్నవ్‌?

రామయ్య: ఏముందోయి.. మొన్న గా మండలాఫీసుల జాగ పట్టా చేసుకున్న ముచ్చట మల్లయ్యకు సెప్తున్న.

మల్లయ్య: అయితవాయే గానీ.. పోయిన పని ఏందాకచ్చింది?

రామయ్య: ఏందాకంటవ్‌.. ఏందె. అద్దెకరం జాగ అద్దగంటల్నే పట్టా అయిపోయింది.

రాజబ్రహ్మం: ఏ ఊకో బావ.. అద్ద గంటల పని అయిపోయిందంటే మమ్మల్ని నమ్ముమంటవా. రెండేండ్ల కింద మా అయ్య పేరు మీది పట్టే మాకు చెయ్యిమంటే మొన్నటి దాక ఆగిండ్రు.. ఆఫీసుల్ల అడ్డగోలు పైసలు గుంజిండ్రు.

మల్లయ్య: కాగితాలు రిజిస్ట్రేషన్‌ ఓ తాన, పట్టా ఓ తాన చేసుకోవాలే గదా. ఏంగాదన్న ఆరు నెలలైన పడ్తది. నీకు అద్దగంటల పనైందంటే ఇచిత్రం అనిపిత్తాంది!

రామయ్య: నేను నీ లెక్కనే అనుకున్న గానీ.. మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారు కొత్త కానూన్‌ తెచ్చిండాట. రైతులు జాగలతోటి తక్లీబ్‌ కావొద్దని ఈ ఇకమతు చేసిండట.

రాజబ్రహ్మం: ఏంటిదే అది?

రామయ్య: ఏముందోయి.. ఇప్పుడు కొత్త కానూన్‌ వచ్చింది. ఎన్కట లెక్క కాగితాలు రిజిస్ట్రేషన్‌కు ఒకకాడికి, పట్టా కోసం మల్లోకాడికి పోయే పన్లేదు. రెండు పనులు మండలాఫీసుల్నె అద్దగంటల ఒడగొడుతుండ్రు.

మల్లయ్య: గట్లెట్లనే..!

రామయ్య: నిజంగనే గా కాపాయన నేను సాక్షం కోసం బంగ్ల కాడి యాదగిరిని తీసుకపోయిన. తాసిల్దార్‌ రూంలకు పోంగనే, కాపాయనను పిలిచి నీవు నిజంగనే రామయ్యకు అద్దెకరం జాగ అమ్మినవ చెప్పు అనంగనే.. ఆ అమ్మిన అని చెప్పిండు. గీ ముచ్చట నిజమేనా అని పక్కకు ఉన్న యాదగిరిని తాసిల్దార్‌ అడిగిండు.. నిజమే సార్‌ అమ్మిండు.. మళ్ల పట్టా చేయిమంటవా? అని అడిగిండు.. ఆ సేయిండ్రి సార్‌.. అని చెప్పంగనే.. మీరు బయట ఉండుపోండ్రి అని చెప్పి.. అద్దగంటలనే మమ్మల్ని పిలిచి పట్టా కాయితం చేతుల పెట్టిండు..

రాజబ్రహ్మం: నాకైతే నమ్మబుద్దయితలేదు బావ..!?

రామయ్య: నీజమెనోయి.. నేను బుద్ధి నేర్సిన కాన్నుంచి, గింత తొందరగ ఆఫీసుల పని కాలేదు. ఇంతమంచి పనిజేసిన మన కేసీఆర్‌ సార్‌ ఫొటో ఆఫీసుల కనబడంగనే.. రెండు చేతులతోటి పబ్బతి పట్టి ఆఫీసునుంచి బయటకు వచ్చిన.

- మద్దూరు (సిద్దిపేట జిల్లా)