బంజారాహిల్స్, నవంబర్ 14: ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో కీలకంగా వ్యవహరించిన బ్రోకర్ నందకుమార్ అలియాస్ నందు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాను లీజుకు తీసుకున్న స్థలానికి తానే యజమానినంటూ నమ్మిస్తూ.. ఇతరులకు దానిని కిరాయికి ఇచ్చి వ్యాపారులను లక్షల్లో మోసం చేశాడు. విషయం తెలుసుకొని నిలదీయడంతో తనకున్న క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్‌తో బెదిరింపులకు దిగడంతో బాధితులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు వ్యాపారులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నందకుమార్ఫై చీటింగ్ కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సబ్‌లీజు ఇచ్చే అధికారం లేకున్నా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ మారేడ్‌పల్లిలోని మహేంద్రహిల్స్‌కు చెందిన సయ్యద్ అయాజ్ (32)తోపాటు సయ్యద్ అజార్, వినయ్ గవానే, కౌశిక్ కన్నమ్ ‘టేస్ట్వెల్ హాస్పిటాలిటీ’ని నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌లో నివాసముండే నందకుమార్ ‘డబ్ల్యూ3 హాస్పిటాలిటీ ్రప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. ఫిలింనగర్ రోడ్ నం.1లోని ప్లాట్ నంబర్-3లో సినీనటుడు దగ్గుబాటి వెంకటేశ్‌కు చెందిన 1000 గజాల స్థలాన్ని నందకుమార్ లీజుకు తీసుకున్నాడు. ఈ క్రమంలో సయ్యద్ అయాజ్, అతని భాగస్వాములతో నందు పరిచయం పెంచుకున్నాడు. ఆ స్థలంలో ‘ఫిల్మీ జంక్షన్’ పేరుతో గతంలో హోటల్ నడిపించామని, ఇక్కడ హోటల్ ఏర్పాటు చేస్తే మంచి లాభాలు వస్తాయని వారికి నందకుమార్ ఆశ చూపించాడు. అక్కడ 3వేల చదరపు అడుగుల స్థలాన్ని తాను లీజుకు ఇస్తానని, అడ్వాన్స్‌గా రూ.12 లక్షలు, నెలకు రూ.2 లక్షల కిరాయి, వ్యాపారంపై 10శాతం కమిషన్ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. నందుకు చెందిన ‘డబ్ల్యూ3 హాస్పిటాలిటీ’ బ్యాంకు ఖాతాకు వారు అడ్వాన్స్ కూడా చెల్లించారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆ స్థలంలోనే ‘దక్కన్ కిచెన్’ పేరుతో అయాజ్, తన భాగస్వాములతో కలిసి రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశాడు. రూ.12 లక్షల అడ్వాన్స్, నెలకు రూ.2 లక్షల కిరాయితోపాటు హోటల్ కోసం రూ.65 లక్షల వరకు వారు పెట్టుబడి పెట్టారు. అయితే దగ్గుబాటి స్థలాన్ని సబ్ లీజుకు ఇచ్చే అధికారం నందకుమార్‌కు లేదు. ఈ విషయం ఈ ఏడాది జూలైలో తెలుసుకున్న నిర్వాహకులు, ఇదే విషయమై నందును నిలదీశారు. మీది కాని స్థలాన్ని మాకెలా ఇస్తారని ప్రశ్నించారు. పెట్టుబడి, అడ్వాన్స్ డబ్బులు చెల్లిస్తే.. తాము అక్కడినుంచి వెళ్లిపోతామని స్పష్టంచేశారు. అయితే నందు డబ్బులివ్వకపోగా ఉల్టా వారిపైనే బెదిరింపులకు దిగారు. దీంతో బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నందు మోసం వల్ల తాము 70 లక్షల వరకు నష్టపోయామని బాధితులు వాపోయారు. మోసం, బెదిరింపులకు పాల్పడినందుకు నందకుమార్‌పై ఐపీసీ 406,420, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అక్రమ నిర్మాణంతో రోడ్డున పడేశాడు..
స్థలాల లీజు పేరిట సెల్‌ఫోన్ విక్రయసంస్థ యజమానినీ మోసగించిన ఘటనలో నందుకుమార్‌పై బంజారాహిల్స్‌లో మరో కేసు నమోదైంది. కోకాపేటకు చెందిన మిట్టా సందీప్‌కుమార్ నగరంలోని పలు ప్రాంతాల్లో ‘గాడ్జెట్ స్టూడియో’ పేరుతో సెల్‌ఫోన్ స్టోర్లను నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌లో కొత్త బ్రాంచ్ కోసం స్థలం లీజుకు కావాలని ఈ ఏడాది మార్చిలో నందుని కోరాడు. ఫిలింనగర్‌లోని ‘దక్కన్ కిచెన్’ ఆవరణలో ఉన్న స్థలం తనదేనని నమ్మించి, అక్కడ 700 చదరపు అడుగుల స్థలం లీజు కోసం రూ.12 లక్షల అడ్వాన్స్‌ను నందు వసూలు చేశాడు. పైగా నెలవారీ కిరాయిని రూ.1.5 లక్షలుగా నిర్ణయించిమరీ ఒప్పందం చేసుకున్నాడు. దీంతో సందీప్ 50 లక్షల వ్యయంతో గాడ్జెట్ స్టోర్ బ్రాంచీని అక్కడ ప్రారంభించాడు. ఆదివారం జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది గాడ్జెట్స్టోర్తోపాటు పక్కనే అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను నేలమట్టం చేశారు. ఆలస్యంగా తేరుకున్న సందీప్ అసలు స్థలం ఎవరిదని ఆరా తీయగా, అది హీరో దగ్గుబాటి రానా పేరుతో ఉన్నదని, దాన్ని సబ్ లీజుకు ఇచ్చే అధికారం నందుకు లేదని తెలిసింది. తనకు మోసపూరితంగా స్థలాన్ని లీజుకు ఇవ్వడంతోపాటు, అక్రమ నిర్మాణాల కూల్చివేతతో తనకు రూ.65లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు సందీప్‌కుమార్ వాపోయారు. నందుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం రాత్రి పోలీసులకు సందీప్ ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద కేసు నమోదైంది.