హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఓటరు నమోదుకు 9వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుండటంతో, త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని బీఆర్ఎస్ నేత, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి సూచించారు.
నాలుగు జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన డిగ్రీ పూర్తిచేసిన పట్టభద్రులందరూ ఖచ్చితంగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆదివారం ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. మార్చిలో జరిగే ఎన్నికల్లో తమ ఓటు హకును వినియోగించుకొనేలా అందరూ సిద్ధం కావాలని కోరారు.
ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ సంఘం ఆవిర్భావం
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మాడల్ స్కూల్స్ టీచర్స్ సమస్యలపై ఉద్యమించడానికి మరో ఉపాధ్యాయ సంఘం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్)కు అనుబంధంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ సంఘం ఏర్పాటైంది. ఆదివారం హైదరాబాద్‌లోని తపస్ కార్యాలయంలో సంఘం ఆవిర్భావ సమావేశాన్ని నిర్వహించారు.
మాడల్ స్కూల్స్ టీచర్ల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సంఘం పనిచేస్తుందని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అడ్‌హక్ కమిటీని ప్రకటించారు. కన్వీనర్‌గా డాక్టర్ జే రామకృష్ణ, కో కన్వీనర్లుగా ఎం రజిని, ఉయ్యాల వెంకటేశ్‌గౌడ్, బీ కిరణ్మయి, బీ రమేశ్‌ను ఎన్నుకున్నారు.