నిన్నటి గురుకులాలు.. విద్యార్థుల విజయగాథలు. సర్కారీ విద్య రూపురేఖల్ని మార్చి దేశానికే ఆదర్శంగా నిలిచిన అద్భుతాలు.దళిత కుసుమాలను చైతన్య శిఖరాలకు చేర్చిన సృజనాలయాలు. కానీ ఇప్పుడవే గురుకులాలు కాంగ్రెస్ ఏలుబడిలో నిర్లక్ష్యపు నీడలో మగ్గుతున్నాయి. ఓ వైపు విద్యార్థుల మరణాలు, మరోవైపు పడిపోతున్న ప్రమాణాలు.. వెరసి గురుకులాలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. అలా తగ్గిన అడ్మిషన్లనే సాకుగా చూపి ఎస్సీ డిగ్రీ కాలేజీల కుదింపునకు కాంగ్రెస్ సర్కారు పావులు కదుపుతున్నది.
Telangana | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): దళిత విద్యార్థులపై కాంగ్రెస్ సర్కారు కక్షకట్టింది. అడ్మిషన్లు లేవనే సాకుతో ఎస్సీ గురుకులాలను కుదించాలని కుయుక్తులు పన్నుతున్నది. ఒకవైపు ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరిట ప్రపంచ స్థాయి విద్యనందిస్తామని ప్రగల్భాలు పలుకుతూ.. మరోవైపు దళిత విద్యార్థులను విద్యకు దూరం చేసే పన్నాగాన్ని గుట్టుగా అమలు చేస్తున్నది. ఇప్పటికే పలు ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలను ఎత్తివేయగా, తాజాగా మరిన్ని కళాశాలలను ఎత్తివేసేందుకు సన్నాహాలు చేస్తున్నది.
ఇంటర్ కాలేజీల కుదింపు దిశగా కూడా వేగంగా అడుగులు వేస్తున్నట్టు గురుకుల ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అట్టడుగువర్గాల్లో అక్షరాస్యతను పెంపొందించాలనే లక్ష్యంతో, దూరదృష్టితో కేసీఆర్ ఏర్పాటు చేసి దశలవారీగా విస్తరించిన గురుకుల వ్యవస్థను నేడు కాంగ్రెస్ సర్కారు ప్రణాళిక బద్ధంగా నిర్వీర్యంచేస్తున్నది. దళితుల అభ్యున్నతికి కేసీఆర్ సర్కారు ఎంతగానో కృషి చేసింది.
దళితవర్గాలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందేలా బాటలు వేసింది. అందులో భాగంగా గురుకుల వ్యవస్థను బలోపేతం చేసింది. మరీ ముఖ్యంగా దళిత యువతులకు ఉన్నత విద్యావకాశాలను కల్పించడానికి, బాల్య వివాహాలను నివారించేందుకు గురుకుల కాలేజీలను ఏర్పాటు చేసింది. స్వరాష్ట్రం ఏర్పడే నాటికి 134 ఎస్సీ గురుకులాలు ఉండగా.. కేసీఆర్ సర్కారు మరో 134 గురుకులాలను ఏర్పాటు చేసి, వాటి సంఖ్యను 268కి పెంచింది.
గురుకులాలను పదో తరగతి నుంచి ఇంటర్‌కు అప్‌గ్రేడ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దళిత విద్యార్థినుల కోసం 30 మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలను ఏర్పాటు చేసింది. బద్వేల్, సంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, మహేంద్రహిల్స్ తదితర కళాశాలల్లో పీజీ కోర్సులను కూడా ప్రవేశపెట్టింది. డిగ్రీ విద్యాతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ తదితర వాటిపై శిక్షణ ఇప్పించింది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీ గురుకుల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది.
ప్రతీ డిగ్రీ మహిళా గురుకుల కాలేజీలో 7 కోర్సులను నిర్వహిస్తున్నారు. ఒక్కో కోర్సుకు 40 చొప్పున 280 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడేండ్లకు కలిపి ఒక్కో డిగ్రీ కాలేజీలో 840 సీట్ల చొప్పున అన్నింటిలో కలిపి 25 వేల సీట్లు అందుబాటులో ఉండగా, వాటిలో చాలా వరకు భర్తీ కావడం లేదు. అందుకు అనేక కారణాలున్నాయి. వాటిపై దృష్టిసారించి, అడ్మిషన్లు పెరిగేలా చూడాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా, ప్రైవేట్ యాజమాన్యం తరహాలో నిర్ణయం తీసుకుంటున్నది. ఇప్పటికే విలీనం పేరిట పలు కాలేజీలను ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో అడ్మిషన్లు లేవనే సాకుతో కళాశాలల కుదింపుపై ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
గ్రామీణ మహిళల సాధికారత కోసం, సాయుధ దళాలకు మార్గదర్శకత్వం వహించేలా, ఉన్నత పౌరురాలుగా తీర్చిదిద్దాలనే ఉదాత్త లక్ష్యంతో కేసీఆర్ సర్కారు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ పరిధిలో పలు ప్రత్యేక గురుకుల కాలేజీలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో 2018లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ను ఏర్పాటు చేసింది. నాటి నుంచి అందులో సాయుధ దళాల కోసం బాలికలకు రక్షణకు సంబంధించి పలు అంశాలపై శిక్షణ అందిస్తున్నది.
ఏటా కళాశాలలో చేరిన 150 మంది మహిళా క్యాడెట్లు ఆర్ట్స్, సైన్స్ లేదా కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీలను అభ్యసించడంతోపాటు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పరీక్షకు సైతం సిద్ధమవుతున్నారు. ఈ కళాశాలను విద్యాసంవత్సరం మధ్యలోనే ఉన్నపళంగా బీబీనగర్ నుంచి ఘట్కేసర్కు తరలించారు. ఆర్డ్ ఫోర్సెస్ కాలేజీ డైరెక్టర్ ఉద్యోగ విరమణ పొంది నెలలు గడిచినా కొత్తవారిని నియమించలేదు. ఇదిలా ఉంటే ఘ ట్కేసర్ పరిధిలోని అవుశాపూర్ క్యాంపస్‌లో బుద్వే ల్, ఇబ్రహీంపట్నం, మహేంద్రహిల్స్ మొత్తంగా 3 మహిళా డిగ్రీ కాలేజీలను నిర్వహిస్తున్నారు.
అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం కాలేజీని ఇటీవల ఎల్బీనగర్కు తరలించారు. ఆయా కాలేజీలను విలీనం చేసి వచ్చే ఏడాది నుంచి ఒకే కళాశాలగా నిర్వహించాలని నిర్ణయించినట్టు సొసైటీ అధికారవర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా మరిన్ని ఎస్సీ డిగ్రీ కాలేజీల విలీనం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఆ దిశగా సొసైటీ ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే పలు కాలేజీలను ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
డిగ్రీ గురుకుల కాలేజీల అనంతరం ఎస్సీ ఇంటర్ గురుకులాలను సైతం కుదించాలని నిర్ణయించినట్టు సొసైటీ అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటిపై ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీచేయకుండా మౌఖిక ఆదేశాల ద్వారానే రాత్రికిరాత్రే తరలింపును ముగిస్తున్నారు. ఉన్నతాధికారులు తీరుపై ఆయా గురుకులాల ప్రిన్సిపాల్స్ సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని విమర్శిస్తున్నారు.