హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): శిశు మరణాలు (ఐఎంఆర్) తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఏడాదిలోపు వయసున్న శిశువుల మరణాల రేటు ఏడేండ్లలో 12 పాయిం ట్లు తగ్గాయి. 2014లో రాష్ట్రంలో పుట్టిన ప్రతి వెయ్యిమంది శిశువుల్లో 35 మరణాలు సంభవించగా, 2018లో 27కు తగ్గింది. 2021 వచ్చేనాటికి 23కు తగ్గింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, శాంపిల్ సర్వే సిస్టం (ఎస్ఎస్ఎస్) దేశవ్యాప్తగా నిర్వహించిన సర్వే ఫలితాలను తాజాగా విడుదలచేసింది. జాతీయస్థాయిలో శిశు మరణాల సగటు 30 ఉండగా, తెలంగాణలో 23గా నమోదైంది. గతేడాదితో పోల్చితే దేశవ్యాప్తంగా శిశు మరణాల సగటు 2 పాయింట్లు తగ్గింది. అత్యధిక అరుణాచల్‌ప్రదేశ్‌లో 8 పాయింట్లు తగ్గ గా, తెలంగాణ, ఏపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 4 పాయింట్ల తగ్గుదల నమోదైంది. మొత్తంగా ప్రతివెయ్యి మందికి 19.7 జననాలు, 6.0 మరణాలు సంభవిస్తున్నాయి.
ప్రభుత్వ పథకాలతో అద్భుత ఫలితాలు
ఐఎంఆర్ తగ్గుదలలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెంచాలనే లక్ష్యంతో మొదలు పెట్టిన కేసీఆర్ కిట్ అద్భుతమే చేసింది. గర్భిణులు, జన్మించిన శిశువుల ఆరోగ్యం కాపాడటంలో ఇది కీలకంగా మారింది. దాంతో మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 20-30 శాతం పెరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. మొత్తం ప్రసవాల్లో 55 శాతం ప్రభుత్వ దవాఖానల్లోనే సురక్షితంగా జరుగుతున్నాయి. నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు పురిటి బిడ్డల ప్రాణాలు కాపాడుతున్నాయి. చిన్నపిల్లల వైద్య నిపుణులు, నర్సులు నిత్యం అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. దేశంలోనే మొదటిసారిగా నల్లగొండలో ఏర్పాటుచేసిన నవజాతీ శిశు సంరక్షణ కేంద్రం అద్భుతాలు సృష్టిస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో ఇక్కడ వైద్యులు సేవలందిస్తున్నారు. అమ్మ ఒడి వాహనాలు గర్భిణులను దవాఖానకు తీసుకొచ్చి, ప్రసవం అనంతరం సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ఉచిత సేవలందిస్తున్నాయి.