హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘నీ సంగతి చూస్త.. ఏమనుకుంటున్నవ్ నవ్వు.. నా పేరెందుకు తీసినవ్? నీ గురించి తెల్వదనుకుంటున్నవా?’ అని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ను బెదించాడు రెడ్డి శ్రీనివాస్. యూత్ కాంగ్రెస్ నేత, కొడంగల్వాసి అయిన అతడు అల్లు అర్జున్ ఇంటిపై దాడిచేసిన కేసులో ప్రధాన నిందితుడు. మంగళవారం సాయంత్రం రిపబ్లిక్ టీవీ చానల్లో ప్రైమ్‌టైమ్ లైవ్ చర్చ జరుగుతుండగా రెడ్డి శ్రీనివాస్ పదేపదే ఫోన్‌చేసి మరీ ఓపెన్‌గా బెదిరించాడు. ‘నీ సంగతి తెలుసు. వేస్ట్పర్సన్వు నువ్వు. నీ వల్ల వచ్చిందేంది? పోయిందేంది? నా పేరు ఎందుకు తీసినవ్.. ఏమనుకుంటున్నవ్.. నీకు తెలివి ఉండొచ్చు.. అబద్ధాలు మాట్లాడకు.. నీకు తెలివి ఉన్నదని, హిందీ, ఇంగ్లిష్ వచ్చని మాట్లాడుతున్నవ్.. రెచ్చిపోతున్నవ్.. డోంట్ యాక్ట్ ప్లే. నేను ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖలో పీహెచ్డీ స్కాలర్‌ను. నిజాలు మాట్లాడు.
నవ్వు బీఆర్ఎస్ బ్రోకర్వు. నువ్వు మా గురించి మాట్లాడుతున్నవా?’ అని శ్రీనివాస్ తిట్ల దండకం అందుకున్నాడు. ‘నన్ను ఎందుకు బెదిరిస్తున్నవ్? అల్లు అర్జున్ ఇంటిపై ఎందుకు దాడి చేశావ్.. నవ్వే దాడి చేశావా? లేదా ఎవరైనా దాడి చేయమన్నారా?’ అని క్రిశాంక్ ప్రశ్నించగా సమాధానం చెప్పకపోగా.. హిందీ, ఇంగ్లిష్ తెలుసు కానీ, తెలుగులోనే మాట్లాడు అంటూ శ్రీనివాస్ బెదిరింపులకు పాల్పడ్డాడు. పక్కనే ఉన్న ఆర్నబ్ గోస్వామి స్పందిస్తూ లైవ్ లింక్ పెడతాను.. నేరుగా మాట్లాడాలని సూచించారు. అయినా, రెడ్డి శ్రీనివాస్ తిట్టడం ఆపలేదు. కాగా, మధ్యాహ్నం ఒకసారి క్రిశాంక్‌కు ఫోన్ చేసిన రెడ్డి శ్రీనివాస్ బెదిరించాడు. అప్పుడు క్రిశాంక్ ఆ ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత రాత్రి 9 గంటల సమయంలో రిపబ్లిక్ టీవీ లైవ్ డిబేట్లో ఉండగా మరోసారి ఫోన్ చేసిన రెడ్డి శ్రీనివాస్ బెదిరింపులకు దిగాడు. దీంతో కట్ చేయడంతో మరోమారు ఫోన్ చేశారు. దీంతో కలగజేసుకున్న ఆర్నాబ్ లౌడ్ స్పీకర్ ఆన్ చేయమనడంతో బెదిరింపుల విషయం బయటపడింది.
కాంగ్రెస్ సర్కారు వైఖరిపై చర్చ
లైవ్‌లో మాట్లాడుతున్న వ్యక్తికి కాంగ్రెస్ నాయకుడు నేరుగా ఫోన్ చేసిన బెదిరించిన ఘటన జాతీయ స్థాయిలో వివాదాస్పదమైంది. ఆర్నాబ్ సైతం కాంగ్రెస్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. లైవ్‌లో జాతీయ స్థాయి అధికార ప్రతినిధిని ఓ కేసులో ప్రధాన నిందితుడైన వ్యక్తి బెదిరించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ బెదిరింపులు స్వయంగా విన్న ఆర్నాబ్ స్పీకర్ ఆన్ చేయమని క్రిశాంక్ కోరారు. దీంతో రెడ్డి శ్రీనివాస్ బెదిరింపులను లైవ్‌లో ఉన్న అందరూ విన్నారు. ఈ బెదిరింపులపై సర్వ త్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి చర్యలు ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని అంటున్నారు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.