హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ఏమైందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై గవర్నర్‌కు గురువారం ఆయన బహిరంగ లేఖ రాశారు.
2019లో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన గవర్నర్.. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసేలా తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికి నాలుగేండ్లవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించినా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కాలేదని తెలిపారు. ఏర్పాటు అంశాన్ని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని గవర్నర్ ఆనాడు హామీ ఇచ్చారని, ఇప్పటికైనా సత్వర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో సతీశ్‌రెడ్డి కోరారు.