మంచిర్యాల, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆదిలాబాద్ జిల్లాలో 58వేల ఎకరాలకు సాగునీరు అందించి రైతులకు కల్పతరువుగా మారాల్సిన చనాక-కొరాట ప్రాజెక్ట్‌ను కాలుష్య కోరల్లోకి నెట్టేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట రెడ్‌జోన్ పరిశ్రమలకు పచ్చ జెండా ఊపితే ప్రాజెక్ట్ మనుగడ ఇక ప్రశ్నార్థకమేనన్న చర్చ జోరుగా సాగుతున్నది. మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్న సున్నపురాయి, మాంగనీస్ ఓర్‌ను కొల్లగొట్టేసి దండుకుందామన్న ఆలోచన వెనుక ఈ ఇండస్ట్రియల్ పార్క్‌కు వ్యూహరచన జరిగిందనే విమర్శలు వినిపిపిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా 10వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటీ..? బ్యాంకుల్లో తనఖా పెట్టిన వేల ఎకరాల భూములు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బంధువులు, బినామీల పేర్ల మీదికి ఎలా మారాయి..? ఈ మొత్తం వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దల మధ్య కుదిరిన ఒప్పందం ఏంది..? నోటిఫికేషన్లలో సరిహద్దుల వివరాలు సైతం సరిగా లేకుండా భూ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంది..? ఆఖరికి సాగునీటి కాలువలను సైతం ఇండస్ట్రియల్ ల్యాండ్ కింద చూపించడం వెనుక అసలు మర్మమేంది..? అనే ప్రశ్నలకు రెండే సమాధానాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయి.
ఒకటేమో అసలు ఇండస్ట్రియల్ పార్క్‌లో ఏయే కంపెనీలు వస్తాయనే దానిపై సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్)లో స్పష్టత లేకుండా కేవలం రెడ్, ఆరెంజ్, ఎల్లో కేటగిరీ కంపెనీలను చూపించినట్టు సమాచారం. రెండోది.. ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరిస్తున్న గిమ్మా(బీ) శివారులో భూములున్న కొరాట గ్రామ రైతులు వెళ్లి కలిసినప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏమన్నా అయ్యేదా.. పోయేదా.. మీ భూములు మీరే దున్నుకోవచ్చు” అని స్థానిక ఎమ్మెల్యే చెప్పిన సమాధానం”.. ఈ రెండింటికీ ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టు అనిపిస్తున్నా.. ఇండస్ట్రియల్ పార్క్ వెనుక అసలు కుట్రలను ఇవే బయట పెడుతున్నాయి.
డీపీఆర్ లేకుండా ఇండస్ట్రియల్ పార్క్!
10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఇంత వరకు డీపీఆర్ సిద్ధం చేయకపోవడం, ఏ పరిశ్రమలు పెడుతారో చెప్పకుండా కేవలం రెడ్, ఆరెంజ్, ఎల్లో కేటగిరీ పరిశ్రమలను చూపించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూ సేకరణ చేసి పరిహారం రూపంలో కోట్లు దండుకోవడం, అభివృద్ధి టెండర్ల పేరుతో వేలకోట్లు కొల్లగొట్టడమే లక్ష్యమనే సందేహాలున్నాయి. పరిశ్రమలకు అవసరమైన రా మెటీరియల్, రవాణా సదుపాయాలు ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆగమేఘాలపై మూడు వేల ఎకరాలు సేకరించడం.. అది నచ్చని ప్రభుత్వ పెద్ద ఆరువేల ఎకరాలు సేకరించాలని అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తుండటం..మొత్తంగా 10వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం.. బ్యాంకుల్లో ఖాయిలా పడ్డ భూములును ఎమ్మెల్యే ఆయన బంధువులు, అనుచరుల పేర్ల మీదికి బదలాయించడం..వాటినే తిరిగి ఇండస్ట్రియల్ పార్క్‌కు అప్పగిస్తుండటం అంతా పథకం ప్రకారమే జరుగుతున్నదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యనేత సహా ఆయన అనుచరులకు బినామీల పేరుతో ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదిత ప్రాంతంలో(10వేల ఎకరాల్లో) భూములున్నాయని.. కేవలం వారి జేబులు నింపుకోడానికే ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూ సేకరణ చేస్తున్నారన్న ప్రచారం సైతం జరుగుతున్నది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలోని సున్నపురాయి, మాంగనీస్ నిక్షేపాలను వెలికితీసి సొమ్ము చేసుకునేందుకే ఇండస్ట్రియల్ పార్క్ అనే నాటకం ఆడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
రెడ్ జోన్ పరిశ్రమల ఎంట్రీ
ప్రస్తుతం ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూ సేకరణ చేస్తున్న భోరజ్, భీంపూర్, తాంసి, జైనథ్ మండలాల్లో సున్నపురాయి, మాంగనీస్ ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన వారు చూపించినట్టు రెడ్‌జోన్ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి వస్తే ప్రధానంగా మైనింగ్ ప్రాజెక్ట్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఖనిజాలను వెలికితీయడానికి బ్లాస్టింగ్, భారీ డ్రిల్లింగ్ యంత్రాలు వాడే పెద్ద మైనింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. సున్నపురాయి ఖనిజాలకు సంబంధించి భారీ సిమెంట్ కర్మాగారాలు, సున్నం బట్టీలు.. మాంగనీస్ ఓర్ ఖనిజానికి సంబంధించి ఫెర్రో-అల్లాయ్ ప్లాంట్లు (ముడి మాంగనీస్‌ను ఇనుముతో కలిపి వేడి చేసి కరిగించి స్టీల్ తయారీకి అవసరమైన లోహం) తయారు చేసే కంపెనీలు, మాంగనీస్ కెమికల్ ప్లాంట్లు ఇవన్నీ రెడ్‌జోన్ పరిశ్రమల జాబితాలోకే వస్తాయి. వీటి ఆధారిత మీడియం స్కేల్ పరిశ్రమలు ఆరెంజ్ అండ్ ఎల్లో పరిశ్రమల జాబితాలోకి వస్తాయి. డీపీఆర్‌పై క్లారిటీ లేకుండా తమ అనుచరులు, అనుయాయులను రంగంలోకి దింపి మైనింగ్ కంపెనీలు ఏర్పాటు చేసి ఖనిజ సంపదను లూఠీ చేసేందుకే సర్కార్ పెద్దలు, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి కుట్రలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘చనాక-కొరాట’కు ముప్పు?
చనాకా-కోరాట ప్రాజెక్ట్‌కు సమీపంలోని భూములు, ప్రాజెక్ట్ ప్రధాన కాలువ వెంట ఉన్న భూములను సైతం ఇండస్ట్రియల్ పార్క్ కోసం సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. మొదటి విడతలో 2026 ఎకరాలు, రెండో విడతలో 1022 ఎకరాల సేకరణకు ఇచ్చిన నోటిఫికేషన్లో చనాక-కోరాట ప్రాజెక్ట్ ప్రధాన కాలువ వెళ్లే భోరజ్ మండలంలోని హథీఘాట్, గూడ, రాంపూర్, గిమ్మ(బి) గ్రామాలున్నాయి. ప్రాజెక్ట్ ప్రధాన కాలువ కోసం గతంలో భూసేకరణ చేసిన రైతుల మిగిలిన భూమిని సైతం ఇండస్ట్రియల్ పార్క్‌లో చేర్చారు. అదీ కాకుండా భూసేకరణ చేస్తున్న హథీఘాట్ గ్రామంలోనే పంప్‌హౌస్‌లోనే సీఎం రేవంత్‌రెడ్డి ట్రయల్న్ నిర్వహించారు. ఇలా చనాక-కొరాట ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ఉన్న భూములను సేకరిస్తున్నారు. ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు ఇరువైపులా మైనింగ్ జరిగితే ప్రాజెక్ట్ కాలుష్య కాసారంగా మారడంతో పాటు ఆయకట్టు కింద ఉన్న వేల ఎకరాలు సైతం ప్రభావితమయ్యే అవకాశమున్నది.
రంగంలోకి డెక్కన్ సిమెంట్స్
ఎమ్మెల్యే పాయల్‌శంకర్ కుమారుడు పాయల్ శరత్, ఆయన బంధువుల పేరుపై ఉన్న ఈ వివాదాస్పద తనఖా భూములు.. ఈ మధ్య కాలంలో డెక్కన్ సిమెంట్స్ పేరు మీదికి మారిపోయాయి. సర్కార్ పెద్దలు, వారి బంధువులు నేరుగా ఆ భూములు కొంటే రచ్చ అవుతుందని.. మధ్యలో డెక్కన్ సిమెంట్స్‌ను రంగంలోకి దింపారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. పైపెచ్చు ప్రభుత్వ ముఖ్యనేత బావమరిది మైనింగ్‌లోనే ఉన్నారు. సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని అడ్డుపెట్టుకొని చేసిన అవినీతిలో ఆయన పేరే ప్రముఖంగా వినిపించింది. ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్శంకర్కు సైతం మైనింగ్‌లో అనుభవం ఉన్నది. ఆదిలాబాద్ రూరల్ మండలం జందాపూర్లో ఇనుము తయారీకి ఉపయోగించే బ్లాక్ స్టోన్ మైనింగ్ వ్యాపారం ఉంది. వీరిద్దరితో పాటు ప్రభుత్వ ముఖ్యనేతలకున్న భూములు సైతం బినామీలు, డెక్కన్ సిమెంట్స్ లాంటి సంస్థల పేర్లపై ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే పాయల్‌శంకర్ వ్యవహారం ఆధారాలతో బయటపడినా ప్రభుత్వ పెద్దలు మౌనం వీడటం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.