Red Mirchi | జూలూరుపాడు, ఫిబ్రవరి 15: దేశానికి పట్టెడు అన్నం పెట్టే అన్నదాతను ఈ ఏడాది ఎర్ర బంగారం అప్పుల పాలు చేస్తుంది. రేయనకా పగలనకా పంట పొలాల్లో శ్వేతం చిందించిన అన్నదాతకు చిల్లి పైసా మిగలక ఒక అప్పుల పాలవుతున్నాడు. ఆటుపోట్లు ఎదుర్కొంటూ సాగు చేపట్టిన రైతులకు పంట చేతికి వచ్చే సమయంలో బహిరంగ మార్కెట్లో మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
గత ఏడాది మండలంలో సుమారు నాలుగువేల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా గిట్టుబాటు ధర లభించడంతో ఈ ఏడాది మండలంలో సుమారు 5 ఎకరాలకు పైగా రైతులు మిర్చి సాగు చేసేందుకు మొగ్గు చూపారు. మిర్చి పంట చీడపీడల బారిన పడకుండా భారీగా పెట్టుబడులు పెట్టి ఈ ఏడాది సాగు చేపట్టారు. ఎకరాకు సుమారు లక్షకు పైగా పెట్టుబడి అయినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కూలీల కొరత ఏర్పడడంతో మిర్చి ఏరేందుకు పక్కా రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకుని వచ్చి పొలాల వద్ద గుడారాలు వేసి మిర్చి ఏరించే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఎకరానికి సుమారు 30 వేల రూపాయలకు పైగా మిరప తోటలు కోసేందుకు ఖర్చు వస్తుందని రైతులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో మిర్చి ప్రస్తుతం క్వింటాలకు పదివేల నుంచి 12000 మాత్రమే నాణ్యతను బట్టి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి ఈ ఏడాది మరీ అధ్వానంగా మారిందని పేర్కొంటున్నారు. అరుకాలం కష్టించిన పంట కల్లాలకు చేరింది తాలుకాయ నాసిరకంను గ్రేడింగ్ చేసి నాణ్యమైన మిర్చీని సిద్ధం చేసి కల్లాలో పట్టాలు కప్పి వచ్చిన కొద్దిపాటి దిగుబడిని రైతులు అమ్మకానికి సిద్ధం చేశారు. రైతుల చేతికి పంట రాగానే ఒకసారిగా మిర్చి ధర పతనం ప్రారంభమైంది దీంతో మిర్చిని అమ్మేందుకు రైతులు సాహసించడం లేదు. అలా అని మిర్చిని ఎలా నిల్వ ఉంచాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో ఉన్న సమయంలో అకాల వర్షాలు వస్తే మిర్చి నాణ్యత తగ్గి మరి రేటు తగ్గుతుందని భయపడుతున్నారు. అలా అని ఏసీ గోడౌన్ లో నిల్వ ఉంచుదామంటే పెట్టిన పెట్టుబడులే వచ్చేలా లేవని గోడౌన్ల భారం అదనంగా పడుతుందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.