మధ్యంతర ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో ప్రొఫెసర్లు, అసొసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు తమ తుది తీర్పునుకు లోబడే ఉండాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నియామకాలు రిజర్వేషన్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయంటూ హైదరాబాద్‌కు చెందిన కే పావని దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి ఇటీవల విచారణ జరిపారు. ఇఫ్లూ నియామకాల్లో బీసీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదని, తనకు అర్హతలున్నా ఉద్యోగానికి ఎంపిక చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది విన్నవించారు. ఈ వాదన అనంతరం ఇఫ్లూకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.