హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : వర్సిటీల్లో రిక్రూట్మెంట్ పాత పద్ధతిలోనే చేయాలని, అలా చేయకపోతే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ స్టేట్ డాక్టరేట్స్ అసోసియేషన్(టీజీడీఏ) ఆవేదన వ్యక్తంచేసింది. కొత్త విధానం, స్క్రీనింగ్ టెస్టుల పేరుతో వివాదం చేయకుండా రిక్రూట్మెంట్ చేపట్టాలని కోరింది. ఈ మేరకు శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. వర్సిటీ రిక్రూట్మెంట్పై కొంతమంది ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పీ నరేందర్రెడ్డి, మాజీ అధ్యక్షుడు పొలాడి రమణారావు, ఉపాధ్యక్షులు బొల్లం తిరుపతి, స్వప్న, అధికార ప్రతినిధులు రవితేజ, తిరుపతి, వినయ్, స్వామినాయక్ తదితరులు పాల్గొన్నారు.