Telangana | హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖ పరిధిలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది శ్రమదోపిడీకి గురవుతున్నారు. కాంట్రాక్టర్లు, మ్యాన్‌పవర్ ఏజెన్సీలు.. నిబంధనల మేరకు పూర్తి వేతనాలు చెల్లించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కార్మికుడికి ప్రతి నెలా సగటున రూ.వెయ్యి వరకు ఎగ్గొడుతున్నారని ఆరోపిస్తున్నారు.
దీంతోపాటు వాస్తవంగా పనిచేస్తున్నవారి కంటే, రిజిస్టర్లో ఎక్కువ పేర్లు చూపుతున్నారని, ఇలా నెలకు కనీసం రూ.2 కోట్ల వరకు కాంట్రాక్టర్లు దండుకుంటున్నారని చెప్తున్నారు. వైద్యారోగ్య శాఖలో డీఎంఈ, టీవీవీపీలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ విభాగాల్లో వీరు విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేలమందికిపైగా పనిచేస్తున్నట్టు అంచనా.
వీరికి ఇచ్చే అరకొర జీతాల్లో అడ్డగోలు కోతలు పెడుతున్నారని, ప్రభుత్వానికి ఇచ్చే లెకల్లో మాత్రం పూర్తిగా చెల్లిస్తున్నట్టు చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల కిందట సూర్యాపేటలో వేతనం అందక ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్య నేపథ్యంలో కాంట్రాక్టర్లు, మ్యాన్‌పవర్ ఏజెన్సీల దోపిడీపై వైద్యవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వరర్స్ యూనియన్ సైతం ఇవే ఆరోపణలు చేస్తున్నది.
జీతంలో 4,500 కట్
2021 జూన్ 11న నాటి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 60లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను స్పష్టం చేసింది. గ్రేడ్-1 వర్కర్లకు రూ.15,600, గ్రేడ్-2 వర్కర్లకు రూ.19,500, గ్రేడ్-3 వర్కర్లకు రూ.22,750 వేతనాలు ఇవ్వాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నది. దవాఖానల్లో పనిచేసే కార్మికులు గ్రేడ్-1 క్యాటగిరీలోకి వస్తారు. ఇందులో పీఎఫ్, ఈఎస్ఐ కింద రూ.3,507 పోగా, మిగిలిన రూ.12,093 కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. కానీ, తమకు రూ.11 వేలు మాత్రమే ఇస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
అంటే ఒక్కొక్కరికి రూ.1093 చొప్పున తగ్గిస్తున్నారు. ఇదేమని అడిగితే పీఎఫ్, ఈఎస్ఐ కింద కడుతున్నట్టు చెప్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐకి సంబంధించి వారి వేతనాల్లో నుంచి సగం, మ్యాన్‌పవర్ ఏజెన్సీలు సగం చెల్లించాల్సి ఉంటుంది. కానీ మ్యాన్ పవర్ ఏజెన్సీలు కట్టాల్సింది కూడా కార్మికులకు వేతనాల్లో నుంచే తీసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దవాఖానల్లో పడకల ఆధారంగా శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. ఉదాహరణకు వంద పడకల దవాఖానకు 45 మంది సిబ్బంది ఉండాలి. వీరు మూడు షిప్టుల్లో పనిచేయాలి. కానీ, అనేక చోట్ల పేపర్లపై లెక్కల కన్నా పనిచేసే సిబ్బంది తక్కువగా ఉంటున్నారని చెప్తున్నారు. ఈ వేతనాలు మొత్తం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపిస్తున్నారు.