హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఈసారి పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో రికార్డ్ స్థాయి ఉత్తీర్ణతా శాతం నమోదైంది. అత్యధికంగా 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,26,166 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 4,97,312 మంది ఉత్తీర్ణులయ్యారు. నిరుటితో పోల్చితే ఈ ఏడాది 3శాతం మంది విద్యార్థులు అధికంగా ఉత్తీర్ణత సాధించడం విశేషం. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ బుధవారం పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ములుగు జిల్లా 99.30%తో ముందంజలో ఉండగా, 89.23%తో హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. నిరుడు 92.78% ఉత్తీర్ణత నమోదైతే, ఈసారి 95.15%తో ఎస్సెస్సీ బోర్డు చరిత్రలోనే రికార్డుస్థాయి ఉత్తీర్ణత నమోదైంది. కొవిడ్ కాలంలో పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేయడంతో అప్పుడు 100% ఉత్తీర్ణత నమోదైంది. ఆ ఫలితాలను మినహాయిస్తే ఎస్సెస్సీ బోర్డు చరిత్రలోనే ఈ విద్యాసంత్సరంలో అత్యధికంగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జీ రమేశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పదో తరగతి ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే సత్తాచాటారు. ఈసారి 96.26% మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా, 94.07% మంది బాలురు పాసయ్యారు. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు 2.19% అధికంగా ఉత్తీర్ణులయ్యారు. నిరుడు బాలికలు 94.26%, బాలురు 91.32% చొప్పున ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల వారీగా తీసుకుంటే ములుగు జిల్లా 99.30%తో అన్ని జిల్లాల కంటే అత్యధిక ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 99.03%తో నాగర్కర్నూల్, 98.96%తో నిర్మల్ జిల్లాలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. హైదరాబాద్ జిల్లా 89.23శాతంతో చివరిస్థానంలో నిలిచింది. ఈసారి పదో తరగతి మెమోలపై మార్కులతోపాటు గ్రేడ్లను సైతం ముద్రించారు. సబ్జెక్టుల వారీగా ఇంటర్నల్ మార్కులు, థియరీ పరీక్షల్లో వచ్చిన మార్కులను కలిపి ముద్రించారు. మొత్తం మార్కులను మాత్రం ముద్రించలేదు. మార్కులేకాకుండా సీజీపీఏ గ్రేడ్లను సైతం కేటాయించారు.

ఫలితాల్లో ప్రైవేట్ విద్యార్థులు (గతంలో ఫెయిలైనవారు) మళ్లీ తప్పారు. వారిలో ఈసారి 59.22శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది 10,733 మంది పరీక్షలు రాస్తే, వారిలో 6,141 మాత్రమే పాసయ్యారు. ఫెయిలైన వారు మళ్లీ పరీక్షలు రాయాల్సి రావడం గమనార్హం. వికలాంగులు 1,493 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 1,409 మంది ఉత్తీర్ణులయ్యారు. యాజమాన్యాల వారీగా తీసుకుంటే సాంఘిక సంక్షేమ గురుకులాలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. ఈ గురుకులాలు 99.10 శాతం ఉత్తీర్ణతతో టాప్లో నిలువడం గమనార్హం.