రామారెడ్డి, జూలై 13: డిప్యూటీ తహసీల్దార్ వేధింపులు తాళలేక రికార్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్‌లో శనివారం వెలుగుచూసింది. డీఎస్పీ నాగేశ్వర్రావు తెలిపిన ప్రకారం.. కామారెడ్డి మండలం గూడెంకు చెందిన తెడ్డు ప్రశాంత్ (28) తాడ్వాయి తహసీల్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహించేవాడు.
డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్ అతడిని తరచూ వేధింపులకు గురి చేయడంతో రామారెడ్డి మండలం కన్నాపూర్ శివారులోని చెట్టుకు శనివారం ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా డీటీ వేధింపుల వల్లే చనిపోతున్నానని ప్రశాంత్ రాసిన సూసైడ్ నోట్ అతడి జేబులో లభించింది. మృతదేహాన్ని కామారెడ్డి దవాఖానకు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.