హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైన పరిస్థితుల్లో అతడు ఏకంగా నాలుగు కొలువులు కొల్లగొట్టాడు. జనగామ జిల్లా రఘునాథపాలెం మండలం కంచనపల్లికి చెందిన కౌడగాని మైసారావు-వినోద రైతు దంపతుల చిన్నకొడుకు మధు ఒకటి నుంచి పదో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాడు.
2009లో టెన్త్‌లో స్కూల్ టాపర్‌గా నిలిచాడు. 2012లో హైదరాబాద్ రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా పూర్తి చేశాడు. 2012లో లాసెట్ రాసి స్టేట్ లెవల్లో సెకండ్ ర్యాంకు సాధించి ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో ఎల్ఎల్బీ చదివాడు. ప్రభుత్వ పోటీ పరీక్షలకు ప్రిపరేషన్‌కు ఉపక్రమించాడు. 2019 లో పంచాయతీ కార్యదర్శిగా తొలి ఉద్యోగం పొందాడు.
2023లో జనగామ కోర్టులో జేఏగా, 2024లో హైకోర్టులో ఎగ్జామినర్‌గా ఎంపికయ్యాడు. జూలై 20న సింగరేణి నిర్వహించిన జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్ష రాశాడు. ఈ నెల 18న ఫలితాలు విడుదల చేయగా సెలెక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తల్లిదండ్రులు, సోదరుడి ప్రోత్సాహంతోనే ఉద్యోగం సాధించానని చెప్పాడు.