సుల్తాన్‌బజార్, ఆగస్టు 16: అధిక రక్త స్రావంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న గర్భిణీలకు ప్లాసెంటా ప్రక్రిటా శస్త్ర చికిత్స ద్వారా వారి ప్రాణాలు కాపాడుతున్నారు కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానా వైద్యులు. ఈ నెలలో ఇప్పటికే 68 మంది ప్రాణాలు కాపాడినట్టు దవాఖాన సూపరింటెండెంట్ డాక్ట ర్ కే రాజ్యలక్ష్మి చెప్పారు. మహిళ తన మొదటి కాన్పులో సిజేరియన్ ద్వారా ప్రసవించినప్పుడు మావిని పూర్తిస్థాయిలో శుభ్రం చేయకపోతే, ఆమె రెండోసారి గర్భం దాల్చినప్పుడు యూట్రస్ గోడలకు అది అతుక్కుపోయే అవకాశం ఉంటుందని వివరించారు. దీంతో ఆమెకు అధిక స్రావం అవుతుందని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో ఒక్కోసారి మూత్రసంచిని కూడా తొలగించాల్సి ఉంటుందని అన్నారు. అధిక రక్తస్రావం అయ్యే గర్భిణిలకు పరీక్షలు చేసి, 32 వారాల వరకు పర్యవేక్షించి ఆ తరువాత ప్లాసెంటా ప్రక్రిటా శస్త్ర చికిత్స చేస్తామని వివరించారు. శిశువు జన్మించిన తరువాతనే ఈ ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఈ శస్త్రచికిత్స సందర్భంగా ఒక్కొక్కరికి 18 నుంచి 20 యూనిట్ల రక్తం అవసరమవుతుందని తెలిపారు. తమ దవాఖానలో గత మూడేండ్లలో 500కుపైగా ప్లాసెంటా ప్రక్రిటా శస్త్రచికిత్సలు చేశామని చెప్పా రు. నల్లగొండ జిల్లా, కంచనపల్లి తాలూకా, బుద్దారం గ్రామానికి చెందిన కే చైతన్య గత నెల 19న అధిక రక్తస్రావం సమస్యతో తమ వద్ద చేరారని, ఆమెకు ఇటీవల ఆరు గంటల పాటు శ్రమించి ప్లాసెంటా ప్రక్రిటా శస్త్ర చికిత్స చేశామని తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.