యాచారం, ఏప్రిల్ 1: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూములను అధికారులు బుధవారం నుంచి రీ సర్వే చేయనున్నారు. ఇబ్రహీంపట్నం, కందుకూరు ఆర్డీవోలు పర్యవేక్షణలో, టీజీఐఐసీ సమక్షంలో రెవెన్యూ అధికారులు అసైన్డ్, పట్టా భూములను సర్వే చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
గ్రామంలో ఇప్పటికే కొంతమంది రైతులకు, ఫార్మా వ్యతిరేక పోరాట సమితి నాయకులకు పోలీసులు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. సర్వే చేసిన భూములకు తిరిగి హద్దురాళ్లు పాతి, చుట్టూ కంచె వేయనున్నట్టు తెలిసింది. ముందుగా మేడిపల్లిలోని 500 ఎకరాలు సర్వే చేయనున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు పరిహారం పొందిన భూములను స్వాధీనం చేసుకొని త్వరలో ఫ్యూచర్‌సిటీకి అప్పగించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
2017లో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించినప్పటికీ ఇప్పటివరకు రైతులు వాటిని సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఫార్మాసిటీ కోసం రైతులు ఇవ్వని 2,200 ఎకరాలకు సంబంధించి రైతుల పేర్లను తొలగించి ఆన్లైన్ రికార్డులో టీజీఐఐసీ పేరును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై హైకోర్టు స్టే కొనసాగుతున్నది. కోర్టులో స్టే ఉండగా భూములను ఎలా సర్వే చేస్తారని కొందరు రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు భూ నిర్వాసితులకు అదనపు పరిహారం కింద ఇచ్చిన ప్లాట్లను పంపిణీ చేసిన తర్వాతే భూములను స్వాధీనం చేసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.