హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మందా విను అనే యువకుడు జనవరి 22న అనుమానాస్పదంగా చనిపోయిన కేసును కరీంనగర్ ఇంటెలిజెన్స్ పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో అతని స్నేహితులే మేడారం జాతరకు తీసుకెళ్లి చంపేశారని, స్థానిక పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ.. బాధిత కుటు ంబ సభ్యులు గత మంగళవారం డీజీపీ ఆఫీసుకు వచ్చి వినతిపత్రం ఇచ్చారు.
దీనిపై ‘న్యాయం కోసం డీజీపీ ఆఫీసుకు’ శీర్షికన నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది. దీంతో నాటి డీజీపీ రవిగుప్తా ఆ కేసును తక్షణమే విచారించాలని మల్టీజోన్-1 ఐజీకి ఆదేశాలిచ్చారు. ఆయన సూచనల మేరకు కరీంనగర్ సీపీ నేతృత్వంలో ఇంటెలిజెన్స్ పోలీసులు నిందితుల వివరాలతో మరోసారి విచారణ చేపట్టారు.
నిందితుల్లోని కొందరు కాంగ్రెస్ నాయకుల అండతో తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు విలపిస్తున్నారు. ఫోన్ మెమొరీ కార్డులు మాయం చేసి సమాచారాన్నంతా డిలీట్ చేసిన నిందితులు.. విను రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి సివిల్ పోలీసులు వంతపాడుతూ కేసును కొట్టివేసే ప్రయత్నం చేస్తున్నారని, డీజీపీ తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.