హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) కాంగ్రెంస్ తప్పుడు కేసులు పెట్టింది. కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్తే కాంగ్రెస్ నేతలు శునకానందం పొందుతున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి(Ravula Sridhar Redd) అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రసన్నం కోసం భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారు. చామల కిరణ్ రెడ్డి లాంటి బ్రోకర్లు కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు.
చామల కిరణ్ రెడ్డి పేమెంట్ కోటాలో రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ పని చేసి పదేళ్లు మంత్రి అయ్యారు . చామల కిరణ్ రెడ్డి రేవంత్ రెడ్డి మోచేతి నీళ్లు తాగి ఎంపీ అయ్యాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక లక్షా 37 వేల కోట్లు అప్పుల్లో
ఎవరి వాటా ఎంతో చెప్పాలన్నారు. రాష్ట్రం కోసం కాంగ్రెస్ ఎంపీలు ఒక్క రోజు ప్రెస్ మీట్ పెట్టలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో చామల కిరణ్ రెడ్డి ఎక్కడ ఉన్నాడని సూటిగా ప్రశ్నించారు. క్విడ్ ప్రో కో అంటే తెలియని వాళ్లు కూడా చిల్లరమల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కేటీఆర్ పై కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కేటీఆర్ ను తిట్టి వార్తల్లో ఉండాలని అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇష్టం వచ్చినట్లు
మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కాంట్రాక్టులు చేసేది
ఎవరు? మీకు వచ్చే వాటాలు ఎంత? అని నిలదీశారు. ఫార్ములా ఈ కేస్ శుద్ధ అబద్ధం. కేటీఆర్ విచారణపై లీకులు ఇస్తున్నారు. మాకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ క్లిన్ చిట్‌తో బయటకు వస్తారని స్పష్టం చేశారు.