దేవరకొండ రూరల్, ఆగస్టు 29 : గురుకులాల్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతుంటే కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ ప్రశ్నించారు. దేవరకొండ మండలం కొండభీమనపల్లి శివారులోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులను ఎలుకలు కరిచిన విషయం తెలుసుకున్న ఆయన గురువారం ఆ వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మెదక్ జిల్లాలోని గురుకులంలో, డిండి ఎస్సీ బాలిక గురుకులంలో, తాజాగా కొండభీమనపల్లి గురుకులంలో విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయన్నారు. గురుకులాల్లో పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుందని నిలదీశారు. ఓవైపు పాముకాట్లతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే.. మరోవైపు కలుషిత ఆహారం తిని దవాఖాన పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 8 నెలల కాలంలో 500 మందికి పైగా విద్యార్థులు దవాఖానపాలు కాగా, 36 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. గురుకులాల అధ్వాన పరిస్థితికి, విద్యార్థుల మరణాలకు విద్యాశాఖకు బాధ్యుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల మీద నోరు పారేసుకోవడంమాని పాలన మీద దృష్టి పెట్టాలని సూచించారు.