హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): హరితహారం కార్యక్రమం అద్భుతమైన ప్రయత్నమని ప్రముఖ నటి రవీనా టాండన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హరితహారం కార్యక్రమానికి సంబంధించిన విశేషాలతో ఇటీవల ఒక ఇంగ్లిష్ పత్రిక వెబ్సైట్లో వచ్చిన కథనాన్ని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మొక్కలు నాటేందుకు ప్రపంచంలో చైనా, బ్రెజిల్ తర్వాత చేపట్టిన మూడో అతి పెద్ద కార్యక్రమమని ఆ కథనం వివరించింది. దీనిపై స్పందించిన రవీనాటాండన్.. ‘అద్భుతమైన ప్రయత్నం! మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను సార్’ అంటూ రీట్వీట్ చేశారు.