హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 7 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్ జిల్లాలోని రావల్కోల్ భూములపై సర్కార్ పెద్దల ఆశలు గల్లంతయినట్టే అనిపిస్తున్నది. పొట్టోడిని పొడుగోడు కొడితే… పొడుగోడిని పోచమ్మ కొట్టినట్టు! పరిస్థితి మారిపోయింది. అధికారం చేతుల్లో ఉన్నది కదా.. అని ప్రజలకు చెందాల్సిన సర్కార్ భూములను రాత్రికిరాత్రి కొల్లగొట్టేందుకు సర్కార్ పెద్దలు భారీ స్కెచ్ వేశారు. నెలల వ్యవధిలో ఉద్యోగ విరమణ చేసేఅధికారికి ఉద్దేశపూర్వకంగా పోస్టింగ్ ఇచ్చి తప్పుడు ఓఆర్సీ ప్రొసీడింగ్స్ జారీ చేసేలా అమలు చేశారు. ఈ అంకమైతే ముగిసిందిగానీ.. భూములు చేతులు మారే సమయానికి తెరపైకి ప్రైవేట్ వ్యక్తులు వచ్చి హైకోర్టును ఆశ్రయించడంతో వ్యవహారం కాస్తా తిరగబడినట్టయింది. 269.36 ఎకరాల భూములపై ఎలాంటి లావాదేవీలు జరుపవద్దంటూ ఇటీవల హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. రెండు వారాల్లో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్డీవో ప్రొసీడింగ్స్ ఆధారంగా పాస్ పుస్తకాలు జారీ చేసే తుది అంకం పూర్తయ్యే సమయంలోనే ఈ ఉత్తర్వులు రావడంతో తెర వెనుక ఉన్న సర్కార్ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారట. ముఖ్యంగా తుది అంకాన్ని ముగించడంతో పాటు హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసే ప్రక్రియలో కీలక పాత్ర పోషించే కలెక్టర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఆసక్తి నెలకొన్నది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలంలోని రావల్కోల్ సర్వేనంబర్ 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాల భూ విస్తీర్ణానికి సంబంధించిన వివాదంపై కీసర ఆర్డీవో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి చెందాల్సిన రూ.5 వేల కోట్ల భూమికి ప్రైవేట్ వ్యక్తులకు ఓఆర్సీ ఉత్తర్వులిచ్చారు. తెర వెనుక కొందరు ప్రభుత్వ పెద్దలు అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రభుత్వానికి చెందిన భూములను ప్రైవేట్‌పరం చేసేలా పావులు కదిపారనే ఆరోపణలున్నాయి. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ భూ వివాదంలో 2003లో అప్పటి జాయింట్ కలెక్టర్ ఓఆర్సీలను రద్దు చేశారు. పచ్చిక భూములు అయినందున 275.16 ఎకరాలు ప్రభుత్వానికి చెందుతాయని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆ ఫైల్ పెండింగ్‌లోనే ఉన్నది. కొన్ని నెలల కిందట కొందరు ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి భారీ ప్రణాళిక వేసి చకచకా ఫైల్‌ను కదిపారు.
స్వతంత్ర ట్రిబ్యునల్‌గా నిర్ణయం తీసుకోవాల్సిన ఆర్డీవో స్థానంలోని వ్యక్తిని బదిలీ చేసి.. నాలుగు నెలల్లో ఉద్యోగ విరమణ చేసే రాజేశ్‌కుమార్‌కు అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. వరుస విచారణలతో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తుది నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి చేశారనేది బట్టబయలైంది. ముఖ్యంగా ఆర్డీవోపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తేవడంలో భాగంగా సీసీఎల్ఏ నుంచి నేరుగా లేఖ రాయించడంతోపాటు అడ్వకేట్ జనరల్ లేఖ ద్వారా ప్రభావితం చేశారని కూడా బయటపడింది. మరోవైపు మేడ్చల్ తహసీల్దార్ అప్పటివరకూ ఇవ్వని నివేదికను కూడా ఇచ్చినట్టుగా చూపుతూ, వాస్తవ నివేదికలోని అంశాలకు విరుద్ధంగా అంశాలను పేర్కొంటూ మే 27న ఓఆర్సీ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఈ మేరకు ‘నమస్తే తెలంగాణ’ గత నెల 13న కథనాన్ని ప్రచురించింది. అయినా ప్రభుత్వ పెద్దలు ఆగలేదు. ఆర్డీవో ప్రొసీడింగ్స్ ఆధారంగా పాస్ పుస్తకాల జారీ కోసం తెర వెనుక భారీస్థాయిలో పావులు కదుపుతూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకూ ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడం వెనుక మతలబు ఏమిటనేది అంతుబట్టడం లేదు. ఈలోగా కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆ భూములు తమవని, ఇనామ్‌దారుల నుంచి తాము కొనుగోలు చేయడంతోపాటు గతంలో ఓఆర్సీలు కూడా వచ్చాయంటూ హైకోర్టును ఆశ్రయించారు.దీంతో వ్యవహారం మలుపు తిరిగింది.
ప్రైవేట్ వ్యక్తులు ప్రధానంగా ఆర్డీవో విచారణనే న్యాయ విరుద్ధమంటూ వాదిస్తున్నారు. 2011లో అప్పటి జేసీ సొంతంగా నిర్ణయం తీసుకోకుండా ఆర్డీవోను తిరిగి విచారణ చేయాలని ఆదేశించడమే చట్టానికి వ్యతిరేకమని, ఒక ఉన్నతాధికారి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని కిందిస్థాయి అధికారికి ఎలా బదలాయిస్తారని సదరు వ్యక్తులు తమ పిటిషన్లో పొందుపరిచారు. దీంతో పాటు గతంలో ఇనామ్‌దారు నుంచి కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు, అనంతరం జారీ చేసిన ఓఆర్సీలతోపాటు మే 27న కీసర ఆర్డీవో ఇచ్చిన ఓఆర్సీ ప్రొసీడింగ్స్‌లోని అవకతవకలు, ఇనామ్‌దారు వారసులమంటూ క్లెయిమ్ చేసిన వాళ్లు సివిల్ కోర్టునుంచి సర్టిఫికెట్లు పొందకపోవడం వంటి వాటిని కూడా న్యాయస్థానం ముందు ఉంచా రు. ఈనేపథ్యంలో ధర్మాసనం రెండు వారా ల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈనెల 14కు విచారణ వాయిదా వేసింది. అప్పటివరకు ఆ భూముల విక్రయాలుగానీ తాకట్టు పెట్టడంగానీ బదిలీ చేయడంగానీ చేయవద్దని స్పష్టం చేసింది.
హైకోర్టు ఉత్తర్వులతో రావల్కోల్ భూముల వ్యవహారం మరింత రసకందాయంలో పడింది. ఇప్పటివరకైతే ఆర్డీవో ప్రొసీడింగ్స్ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని భూ భారతి పోర్టల్‌లోని వివరాల ద్వారా అర్థమవుతున్నది. అంటే ఇనామ్‌దారు వారసులంటూ ఐదుగురి పేరిట 275.16 ఎకరాలను కట్టబెడుతూ ఆర్డీవో ఉత్తర్వులు ఇచ్చినా, పట్టాదారు పాసు పుస్తకాలు జారీ కాలేదని తెలుస్తున్నది. దీంతో ఇప్పుడు జిల్లా కలెక్టర్ వేయబోయే అడుగులపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. పాస్ పుస్తకాలను జారీ చేయడంతోపాటు హైకోర్టుకు దాఖలు చేయనున్న కౌంటర్ అఫిడవిట్లో ఆర్డీవో ప్రొసీడింగ్స్‌పై ఏ రకమైన వాదన వినిపిస్తారనేది అత్యంత కీలకంగా మారుతుందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.