హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం, గోధుమలను తక్కువ ధరకు కొని, రీసైక్లింగ్ చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ రిజ్వాన్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
చాంద్రాయణగుట్టకు చెందిన ఫాతే అలియాస్ చిచ్చతో కలిసి రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నాడు. వీరికి ఉప్పుగూడకు చెందిన రజినీకాంత్, రాజేశ్వర్, మరో ముఠాకు చెందిన కిరణ్, ఫారూక్, సాయి బియ్యం, గోధుమలు సేకరించి విక్రయిస్తున్నారు.
వీటిని రీ సైక్లింగ్ అనంతరం ఎక్కువ ధరకు విక్రయిస్తుంటారు. కాగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులకు అందిన సమాచారంతో వారి ఇండ్లలో తనిఖీలు చేపట్టారు. 14 టన్నుల బియ్యం, 15 క్వింటాళ్ల గోధుమలు పట్టుబడ్డాయి. వీటి విలువ సుమారు రూ. 3.25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. మహ్మద్ రిజ్వాన్, రజినీకాంత్, రాజేశ్వర్‌ను అదుపులోకి తీసుకోగా, మిగతా నిందితులు పరారీలో ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు.