హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మొదటి భారతీయ కళా మహోత్సవం నిర్వహించనున్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సాంస్కృతిక మంత్రిత్వశాఖల సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మతోపాటు ఎనిమిది రాష్ర్టాలకు చెందిన గవర్నర్లు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు.
రాష్ట్రపతి నిలయంలో బుధవారం భారతీయ కళా మహోత్సవ పోస్టర్ను విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ ఓఎస్డీ స్వాతిషాహి, సీఈవో రజినీప్రియ, ఎన్ఈహెచ్హెచ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే సింగ్ మహోత్సవ వివరాలను వెల్లడించారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 6 వరకు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల మధ్య ప్రజలు ఈ మహోత్సవాన్ని సందర్శించవచ్చని తెలిపారు. జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఉచిత బస్సు సర్వీసులు ఉంటాయని చెప్పారు. https://visit.rashtrapatibhavan.gov.in ద్వారా ఉచితంగా బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.