హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజెస్ – క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎంఎస్ఈ-సీడీపీ) కింద తెలంగాణలోని 8 జిల్లాల్లో వివిధ రకాల ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ఉన్న కొన్ని క్లస్టర్లను విస్తరించడంతోపాటు కొత్తగా మరికొన్ని క్లస్టర్ల ఏర్పాటుకు టీఎస్ఐఐసీ సన్నాహాలు చేస్తున్నది.
వీటిలో బుగ్గపాడు, మడికొండ, మంథనిలోని క్లస్టర్ల పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. నల్లగొండ, ఆర్మూర్, బుచినల్లిలోని క్లస్టర్ల పనులు వివిధ దశల్లో ఉన్నట్టు చెప్పారు. స్థానికంగా లభ్యమయ్యే వనరులు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎగుమతుల ద్వారా వాటికి మంచి ధర లభించేలా చూడటంతోపాటు యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యాలతో ఎంఎస్ఈ – సీడీపీ పథకాన్ని చేపట్టారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి గ్రాంట్ మంజూరు చేస్తుంది.