రంగారెడ్డి, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : అది సోమవారం రాత్రి 8:30 గంటలు. కొంగరకలాన్.. చుట్టూ సంజీవని వనం. సమీపంలో గుర్రంగూడ ఎక్స్ రోడ్డు. వాహనాలన్నీ పరుగులు తీస్తున్నాయి. పెద్ద సారు అప్పజెప్పిన పనిని పూర్తి చేయడానికి రంగారెడ్డి కలెక్టరేట్‌కు చెందిన సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్‌రెడ్డి అక్కడికి చేరుకున్నాడు. ఈలోపు ఓ బాధితుడు తన పని కోసం రూ.8 లక్షల లంచం ఇచ్చేందుకు అక్కడ వేచి ఉన్నాడు. ఆ డబ్బును బాధితుడి నుంచి మదన్‌మోహన్‌రెడ్డి తీసుకుని లెక్కించటం మొదలెట్టాడు. ఈలోపు అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు రెప్పపాటులో మదన్‌మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. సీన్ కట్ చేస్తే తూచ్.. ‘ఇది నేను కాదు.. మా పెద్ద సారు చెప్పాడు. నన్ను వదిలేయండి’ అని మొరపెట్టుకున్నాడు. కావాలంటే నిరూపిస్తానన్నాడు. ఎవరా పెద్ద సారు? అని అడిగితే.. అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే…. ఇదే లొకేషన్ నుంచి సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డి రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డికి ఫోన్ చేశాడు. ‘సార్ మనం అనుకున్న డబ్బులు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడే లెక్కించా. రూ.8 లక్షలు బరాబర్ ఉన్నాయి. ఇప్పుడేం చేయాలి?’ అని అడిగాడు. మరికొన్ని గంటల్లో ఆ నోట్ల కట్టలు ఇంటికి వస్తాయంటూ సంబురపడ్డ అదనపు కలెక్టర్.. పెద్ద అంబర్‌పేట ఓఆర్ఓర్ వద్దకు ఆ డబ్బులను తీసుకొని రా అని హుకుం జారీచేశాడు. అదే రోజు సమయం రాత్రి 10:41 గంటలు. ఏసీబీ టీంతో మదన్‌మోహన్‌రెడ్డి అక్కడికి చేరుకున్నాడు. లొకేషన్‌కు వచ్చానని ఫోన్‌చేశాడు. ఈలోపు ఏసీబీ టీం కొంత దూరాన మాటువేసింది. తీరా భూపాల్‌రెడ్డి రానే వచ్చారు. మదన్‌మోహన్‌రెడ్డి నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వెంటనే పట్టుకున్నారు. దీంతో అదనపు కలెక్టర్ బండారం మొత్తం బయటపడింది.
నిషేధిత జాబితాలోని భూమిని తొలగించేందుకు రూ.8 లక్షలు డిమాండ్ చేసి రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడకు చెందిన జక్కిడి ముత్యంరెడ్డికి సంబంధించిన 14 గుంటల భూమి నిషేధిత జాబితాలో చేరింది. ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ తహసీల్దార్‌కు అర్జీ పెట్టుకున్నారు. తహసీల్దార్ పరిశీలన తర్వాత ఆర్డీవో ఆమోదం పొందాక.. సదరు ఫైలు గత జూన్ 26న రంగారెడ్డి జిల్లా అదనపు(రెవెన్యూ) కలెక్టర్ భూపాల్‌రెడ్డి పరిశీలనకు వచ్చింది. నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు అదనపు కలెక్టర్ రూ.8 లక్షలు అడుగుతున్నారని.. ఈ-సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డి లంచం డిమాండ్ చేశారు. ఒక్క పైసా తగ్గినా పనికాదని కరాఖండీగా చెప్పటంతో బాధితుడు వారం క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఆ అవినీతి అధికారులను పట్టుకొనేందుకు ఏసీబీ పక్కా స్కెచ్ వేసింది. వల వేసి అదనపు (రెవెన్యూ) కలెక్టర్ భూపాల్‌రెడ్డి, ఈ-సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డిని పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు తరలించారు.
పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ వద్ద రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాక వారిద్దరిని అదే రాత్రి కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు ఏసీబీ అధికారులు తరలించారు. రాత్రంతా కార్యాలయంలోనే ఉంచి సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత మంగళవారం తెల్లవారుజామున నాగోల్‌లోని భూపాల్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.16 లక్షల నగదుతోపాటు పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ పనివేళలో కలెక్టరేట్లో మరోసారి సోదాలు నిర్వహించారు. సోదాలు జరుగుతున్నంత సేపు కలెక్టరేట్ దరిదాపుల్లోకి జిల్లా స్థాయి అధికారులెవరూ రాలేదు.
నాంపల్లి కోర్టులు: అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు మంగళవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని కోరడంతో ఈ పని కోసం జాయింట్ కలెక్టర్ ఆదేశానుసారం తాను రూ.8 లక్షలు డిమాండ్ చేశానని సీనియర్ అసిస్టెంట్ వెల్లడించారు. కోర్టు వారిద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : నగరంలో ఉన్న జీఎస్టీ కమిషనరేట్‌లో లంచం ఆరోపణలపై ఇద్దరు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. జీఎస్టీ డిపార్టుమెంట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక పని విషయంలో రూ.5 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు బాధితుడు సీబీఐకి ఫిర్యాదులో చేశాడు. ఈ మేరకు హైదరాబాద్‌లోని రెండు చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించగా నేరారోపణ పత్రాలు లభించాయి.