Telangana Police | పట్టపగలే కాల్పులు జరిపి చోరీ.. తెలంగాణ పోలీస్ అంటే దోపిడీ ముఠాల్లో భయం పోయిందా?
Telangana Police | తెలంగాణ పోలీస్ అంటే.. దోపిడీ ముఠాల్లో భయం పోయిందా? ఇటువైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే ముఠాలు ఇప్పుడు యథేచ్ఛగా తిష్టవేశాయా? భయంకరమైన దోపిడీ ముఠాలపై ఇంటెలిజెన్స్‌కు ఏమాత్రం సమాచారం లేదా? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు.
Telangana Police | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్ అంటే.. దోపిడీ ముఠాల్లో భయం పోయిందా? ఇటువైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే ముఠాలు ఇప్పుడు యథేచ్ఛగా తిష్టవేశాయా? భయంకరమైన దోపిడీ ముఠాలపై ఇంటెలిజెన్స్‌కు ఏమాత్రం సమాచారం లేదా? అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. పట్టపగలే తుపాకులతో, మారణాయుధాలతో తిరుగుతూ.. దోపిడీలకు పాల్పడుతున్నా వ్యవస్థ మొద్దునిద్ర వీడటం లేదు. గత డిసెంబర్ 30న పోలీసుశాఖ విడుదల చేసిన వార్షిక క్రైమ్ నివేదిక ప్రకారం రోజుకు 53 దొంగతనాలు ఎక్కడో ఓ చోట జరుగుతున్నాయి. తలుపులు బద్దలు కొట్టి/ఇంట్లోకి చొరబడి చేసే దొంగతనాలు రోజుకు 18 నమోదవుతున్నాయి. ఇక బందిపోటు దొంగతనాలు దాదాపు 24శాతం పెరిగాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. ఆ ముఠాలను భయపెట్టే చర్యలు తీసుకోవడంలో వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది.
పట్టపగలే కాల్పులకు తెగబడుతూ..
తెలంగాణలో దోపిడీలు, దొంగతనాలు, చోరీల కేసులు భారీగా నమోదవుతున్నట్టు పోలీసుల లెక్కలు చెప్తున్నాయి. ఉన్నోళ్లు, పేదోళ్లు, వృద్ధులు అనే తేడా లేదు.. గుడి, బడి, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ ఆఫీసులు, ఇండ్లు అనే భేదం లేదు.. ఏదైనా సరే అందినకాడికి దొంగలు దోచుకుంటున్నారు. పట్టపగలే తాళాలు పగులగొట్టి ఇండ్లలోకి దూరి చోరీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిరుడు ఖజానా జ్యువెలర్స్‌లో సైతం కాల్పులకు తెగబడి బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. ఆ రోజు ఉదయమే మరో ఘటనలో కూకట్‌పల్లిలో బంగారం, నగదు దోచుకెళ్లారు. తాజాగా కరీంనగర్ పట్టణంలో పీఎంజే జ్యువెలరీలో కూడా సిబ్బందిపై కాల్పులు జరిపి మరీ బంగారం, వెండి, ఇతర ఆభరణాలు కొల్లగొట్టారు. కొన్నిచోట్ల మారణాయుధాలతో దాడిచేసి దోచుకుంటున్నారు. ఇంతలా భయపెట్టి, చంపేందుకు కూడా వెనుకాడని దోపిడీ గ్యాంగ్‌లు తెలంగాణలో తిష్టవేసినా.. హోంమంత్రిత్వ శాఖను చూస్తున్న ముఖ్యమంత్రికి పట్టడం లేదని విమర్శలొస్తున్నాయి.
ఇంటెలిజెన్స్‌కు సమాచారం శూన్యం
రాష్ట్రంలో ఎక్కడ చోరీ జరిగినా లక్షలాది రూపాయలు నష్టపోవడమే కాకుండా.. విలువైన బంగారం, ఆభరణాలు, వస్తువులను కోల్పోతున్నారు. చోరీల కోసమే అంతరాష్ట్ర ముఠాలు తెలంగాణ సరిహద్దుల్లో తిష్టవేసినట్టు తెలుస్తున్నది. ఈ దోపిడీ గ్యాంగ్‌ల రాకపట్ల ఇంటెలిజెన్స్‌కు సమాచారం లేదని తెలుస్తున్నది. దొంగతనం, దోపిడీలు జరిగిన తర్వాత దర్యాప్తులు చేపడుతున్నారే తప్ప ఆయా ముఠాలపై నిఘా పెట్టడం, తెలంగాణవైపు రాకుండా భయపెట్టడం, ఎస్పీలు, కమిషనర్లను, వారి ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడంలో వ్యవస్థ విఫలమవుతున్నది. గతంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో దోపిడీ, పార్థీ, భవేరియా ముఠాలు తెలంగాణవైపు రాకుండా నిలువరించారు. 2020లో 8,330 దొంతనాలు జరిగితే.. 2024కు ఆ సంఖ్య 19,480కి పెరిగింది. ఇండ్లలో దోపిడీలు 2020లో 3,476 జరిగితే.. 2024 నాటికి 5,724కు చేరాయి. భారీ దోపిడీలు 2020లో 305 నమోదైతే 2024కు ఆ సంఖ్య 703కు చేరింది. గతంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది.. పోలీసులు కూడా ఎంత చురుగ్గా స్పందించేవారు అనడానికి ఈ లెక్కలే నిదర్శనాలు.
ఇటీవల సంచలనం సృష్టించిన దోపిడీ కేసులివే..
- 2026 మే 3న : కరీంనగర్ పట్ణణంలోని జ్యోతినగర్‌లో పీఎంజే జ్యువెలరీలోకి ఐదుగురు దుండగులు చొరబడి తుపాకులతో కాల్పులు జరిపి, ఉద్యోగులను గాయపర్చి భారీగా బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు.
- 2026 జనవరి 6న : హైదరాబాద్‌లోని జ్యువెలరీ షాపులో బొమ్మ పిస్టల్‌తో బెదిరించి నగలు దోచుకున్నారు.
- 2026 జనవరి 2న : హైదరాబాద్ నగర శివారులోని రాంపల్లి ఎక్స్‌రోడ్స్‌లో ఉన్న బాలాజీ జ్యువెలర్స్‌లోకి దుండగులు తుపాకీ, గొడ్డలితో వచ్చి దోపిడీకి తెగబడ్డారు. యజమాని ప్రతిఘటించడంతో పారిపోయారు. 2025 డిసెంబర్ 4న జరిగిన ఓ దోపిడీలో వీరి ప్రమేయం ఉన్నదని తెలుసుకున్నారు.
- 2025 ఆగస్టు 12న : కూకట్పల్లి సమీపంలోని చందానగర్‌లో ఆరుగురు సాయుధ దొంగల ముఠా ఖజానా జ్యువెలరీని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపి, డిప్యూటీ మేనేజర్‌ను గాయపర్చి, దోపిడీకి పాల్పడ్డారు.
- 2026 ఫిబ్రరి 10న: జూబ్లీహిల్స్ ప్రాం తంలో నేపాల్ గ్యాంగ్ ఓ ఇంటిని కొల్లగొట్టి రూ.1.3 కోట్ల విలువైన బంగా రం, వజ్రాల ఆభరణాలు దోచుకెళ్లారు.
- 2026 జనవరి 15న: చెంగిచెర్లలో 9 ఇండ్లలో బంగారం, 8 కేజీల వెండి, 2 లక్షల నగదు దోచుకున్నారు.
- 2026న జనవరి 15న : హైదరాబాద్‌లోని ఓ దేవాలయంలో 26 లక్షల వి లువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తించారు.
- 2026 జనవరి 31న: కోఠిలో సాయుధ దోపిడీ ముఠా ఏటీఎంలో నగదు జమచేస్తున్న వ్యాపారిపై కాల్పులు జరిపి 6 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.
- 2026 ఏప్రిల్ 13న : బాన్సువాడలో 6 ఇండ్లలో చోరీలు జరిగాయి.
- 2026 ఏప్రిల్‌లో: కూకట్‌పల్లిలో ఓ ముఠా నగదు రవాణా చేసేవారిపై కారం చల్లి రూ.కోటి దోచుకున్నారు.
2025 వార్షిక క్రైమ్ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితి
- రోజుకు 10 బలాత్కారాలు,4 కిడ్నాప్ కేసులు నమోదు..
- తెలంగాణలో సగటును రోజుకు 3 హత్యలు జరిగితే.. అందులో ఓ మహిళ ఉంటుంది.
- గంటకు ముగ్గురు చొప్పునరోజుకు 74 మంది మిస్సింగ్..
- రోజుకు 53 దొంగతనాలు, 18 దొంగతనాలు (తలుపులు బద్దలు కొట్టి/ఇంట్లోకి చొరబడి చేసేవి)
- 3 నమ్మకద్రోహం, 85 చీటింగ్ కేసులు
- రోజుకు 8 డ్రగ్స్ కేసులు నమోదు
- రోజుకు 21 వాహనాలు చోరీ
- రోజుకు 75 రోడ్డు ప్రమాదాలు, సగటున 20 మంది మృతి, 44 మంది క్షతగాత్రులు
- రోజుకు సగటున రూ.5 కోట్లు కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు
- స్త్రీల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే కేసులు రోజుకు 20 చొప్పున నమోదు
- రోజూ ఎక్కడో ఓ చోట ఎస్సీ, ఎస్టీలను కులంతో దూషిస్తున్నారు.. హర్ట్ చేస్తున్నారు
- రోజుకు సగటున అన్ని స్టేషన్లలో 683 ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. వాటిల్లో సగటున 500 ఐపీసీ కేసులు నమోదుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

