బొడ్రాయిబజార్, ఏప్రిల్ 19: సూర్యాపేట జిల్లా కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డితో శుక్రవారం జిల్లా కేంద్రంలోని రవి మహల్లో ఏర్పాటు చేసిన సూర్యాపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. అక్కడ స్టేజీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి ఫొటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో రమేశ్‌రెడ్డి ఫొటో ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాలని స్టేజీ మీద ఉన్న నాయకులను నిలదీశారు. నాయకులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వినకుండా నినాదాలు చేస్తూ స్టేజీ ఎదుట అరగంట పాటు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కలుగజేసుకుని కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి చేస్తే మర్యాద దక్కదని, మీరు నిరసన చేస్తే మీ నాయకుడికే అవమానమన్నారు. పనికిరాని నినాదాలతో ఒరిగేదేమీ లేదన్నారు. ఇష్టం లేని వారు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవాలని మందలించారు. అనంతరం పటేల్ రమేశ్‌రెడ్డి కలుగజేసుకుని కార్యకర్తలకు సర్ది చెప్పి సంయమనం పాటించాలని కోరారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. పటేల్ రమేశ్‌రెడ్డికి, తనకు ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని, తమకు లేని విభేదాలు మీకెందుకని చెప్పడంతో నాయకులు, కార్యకర్తలు శాంతించారు. కాంగ్రెస్‌లో వర్గపోరు కొనసాగుతున్నదని, ఆ వర్గపోరే కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కారణమవుతుందని అక్కడకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు చెప్పుకోవడం కనిపించింది.