హైదరాబాద్ : గిరిజనుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ట్రైకార్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఇస్లావత్ రామచంద్రనాయక్కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సదర్భంగా ఆమె మాట్లాడుతూ..గిరిజన సంక్షేమ శాఖ ట్రైకార్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.
గిరిజనులను వృద్ధులోకి తీసుకురావడం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు గిరిజనులు అందరికీ సమానంగా అందాలన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు అందించే సంక్షేమాలు ప్రతి ఒక్కరికి చేరేలా చూసే బాధ్యత మన అందరి పైన ఉందన్నారు.
ప్రజల సమస్యలు తెలిసిన సీనియర్ నాయకుడిని,ఈ సంస్థ చైర్మన్ గా నియమించినందుకు సీఎం కేసీఆర్కు గిరిజనుల తరుఫున కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, గిరిజన కోపరేటివ్ సొసైటీ చైర్మన్ రమావత్ వాల్య నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, ట్రైకార్ జీఎం శంకర్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.