Rajya Sabha Elections |హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలకు ఇస్తున్నదా? తెలంగాణేతర నేతలకు కట్టబెట్టనున్నదా? అన్న విషయంపై చర్చ జరుగుతున్నది. రాజ్యసభ ఉపఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ సభ్యుడిగా కొనసాగిన కే కేశవరావు రాజీనామాతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ఈ స్థానానికి ఎన్నికయ్యేవారు 2026 ఏప్రిల్ 9 వరకు కొనసాగనున్నారు. ఈ నెల 14 నుంచి 21 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఆగస్టు 27న ప్రకటిస్తారు. ఎన్నిక అవసరమైతే సెప్టెంబర్ 3న పోలింగ్ జరగనున్న ది.
అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాలను పరిశీలిస్తే ఈ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన కేకేను తిరిగి రాజ్యసభకు పంపేది కష్టమేనని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేశవరావు స్థానంలో ఎవరిని పంపుతారన్నది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.
కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పార్టీ సీనియర్లలో ఒకరిని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. హిమాచల్‌ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కేవలం ఒక ఓటుతో ఆయన రాజ్యసభకు ఎన్నిక కాలేకపోయారు. దీంతో సింఘ్విని రాజ్యసభకు పంపించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ఆలోచనపై తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.