Monsoon | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు సోమవారం తెలంగాణను తాకాయి. నాగర్ కర్నూల్, గద్వాల, నల్లగొండ మీదుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. సాధారణంగా జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి వచ్చే నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చాయి. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనావేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేటి నుంచి మూడు రోజుల పాటు దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్రంలో ఆదివారం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్‌లలో భారీ వర్షం కురిసింది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదనట్టు అధికారులు తెలిపారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని గౌరికుంటతండాలో పలు ఇండ్లల్లోకి వరద నీరు చేరింది. తండాలోని రమావత్ కన్యానాయక్ ఇంట్లో సంఘ బంధానికి సంబంధించిన డబ్బులు లక్ష రూపాయాలు తడిసిముద్దయ్యాయి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులకు నాగిరెడ్డిపేట, బంజర శివారులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్తు స్తంభాలు నేలకూలగా, చెట్లు విరిగిపడ్డాయి. వైర్లు తెగిపోవడంతో గ్రామాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో నాగిరెడ్డిపేటతో సహా గ్రామాలన్నీ రాత్రంతా అంధకారంలో ఉన్నాయి.