29 వరకు వరుసగా మూడు రోజులు నిర్వహణ
ఫేస్బుక్, యూట్యూబ్‌లో లాటరీ ప్రక్రియ లైవ్
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పరిధిలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల లాటరీ సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. ముందుగా సోమవారం (27న) పోచారం ఫ్లాట్ల లాటరీ తీస్తారు. 28న బండ్లగూడ (ట్రిపుల్ బెడ్రూం డీలక్స్ మినహా మిగిలినవి), 29న బండ్లగూడ ట్రిపుల్ బెడ్రూం డీలక్స్ ఫ్లాట్ల లాటరీ తీయనున్నారు. మొత్తం 3,716 ఫ్లాట్లకు 39,082 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో ఒక బండ్లగూడ ఫ్లాట్లకే 33,161 అప్లికేషన్లు వచ్చాయని రాజీవ్ స్వగృహ అధికారులు తెలిపారు. లాటరీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఈ ప్రక్రియ మొత్తాన్ని యూట్యూబ్, ఫేస్బుక్లో లైవ్ టెలికాస్ట్‌తో పాటు రికార్డ్ చేస్తామని వెల్లడించారు.
లాటరీ తీసిన అనంతరం ఫ్లాట్ నంబర్, దరఖాస్తుదారుడి పేరును బహిర్గతం చేస్తారు. వారి వివరాలను www.hmda.gov.in, www.swagruha. telangana.gov.in వెబ్సైట్లో ఈ నెల 29 సాయంత్రం నుంచి అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. ఒక వ్యక్తి ఒకే ఫ్లాట్‌కు అర్హుడని, రెండు ఫ్లాట్లు వస్తే ఒకటి రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఫ్లాట్ దకించుకొన్నవారు వారంలోగా 10 శాతం, రెండు నెలల్లో మిగిలిన 80 శాతం, మిగిలిన పది శాతాన్ని 3 నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.