హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి వివాదాలు లేని నివాసయోగ్యమైన ఓపెన్ ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించడానికి తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. తమ అభిరుచులకు అనుగుణంగా ఇంటిని నిర్మించేందుకు అనువుగా ఉన్న స్థలాలను (ప్లాట్లను) కొనుగోలు చేయడానికి ఇది మరో చకటి అవకాశం అని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని కుర్మల్‌గూడ, తొర్రూర్, మేడ్చల్-మలాజిగిరి జిల్లాలోని బహదూర్‌పల్లి ప్రాంతాల్లో మొత్తం 167 ప్లాట్లకు అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ వరకు మూడురోజులపాటు ఈ-వేలం నిర్వహించనున్నట్టు ఆయన పేరొన్నారు.
తొర్రూర్‌లో 200-500 చదరపు గజాల విస్తీర్ణంలోని 120 ప్లాట్లకు, కుర్మల్‌గూడలో 200-300 గజాల విస్తీర్ణంలోని 29 ప్లాట్లు, బహదూర్‌పల్లిలో 200-1000 గజాల విస్తీర్ణంలోని 18 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించనున్నామని చెప్పారు. ఈ-వేలంలో పాల్గొనే వారు ముందుగా ఆన్లైన్లో ఎంఎస్టీసీ పోర్టల్‌లో రిజిస్టర్ చేయించుకోవాలని తెలిపారు.
బిడ్డర్ల వివరాలు, బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు ఎవరికీ తెలియవని, అందువల్ల కొనుగోలుదారులు స్వేచ్ఛగా వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ అక్టోబరు 27 కాగా 28న ఉదయం కుర్మల్‌గూడలో, మధ్యాహ్నం బహదూర్‌పల్లి ఈ-వేలం నిర్వహిస్తారు. అలాగే తొర్రూర్‌లోని 120 ప్లాట్ల కొనుగోలుదారులు 28వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి 29, 30 తేదీల్లో ఒకో సెషన్లో 30 ప్లాట్లు చొప్పున మొత్తం నాలుగు సెషన్స్‌లో వేలం నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ వెబ్సైట్ నుంచి పొందవచ్చు.