హైదరాబాద్ : నమ్మించి ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్ఏ(Congress DNA) లోనే ఉందని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్(Rajiv Sagar) అన్నారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసి 420 రోజులు అవుతున్న సందర్భంగా లంగర్ హౌజ్‌లోని గాంధీజీ విగ్రహానికి చెవిలొ పువ్వులు పెట్టుకుని మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాల్ రాజ్ యాదవ్‌తో కలిసి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.. 420 హామీలను నేరవేర్చని కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ కేటీఆర్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నేరవేరని హామీలను ఇచ్చి మోసం చేసిందన్నారు. నమ్మి నానబోస్తే పుచ్చి పురుగులైనట్లు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేస్తే పట్టించుకోవడం మానేసిందన్నారు. రైతు రుణమాఫీ, రైతుభరోసా ఇలా ప్రతి విషయంలో నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుందన్నారు. క్యాబినెట్‌లోని సీఎం, మంత్రులు చెప్పే మాటలు ఒకరికి ఒకరికీ సంబంధం ఉండవన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ల అధికారిక ట్విటర్ అకౌంట్లో ఫాంహౌజ్ పాలన కావాలా? ప్రజా పాలన కావాలా అని పోల్ పెడితే యావత్ ప్రజలు కేసీఆర్ పాలనే కావాలన్నారు. సోషల్ మీడియాలో ఇంత వ్యతిరేకత ఉంటే క్షేత్రస్థాయిలో మరింత వ్యతిరేకత కనిపిస్తుందన్నారు.
సర్కార్ ను ప్రశ్నిస్తే అరెస్టులు, కేసుల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో లక్షా 27 వేల కోట్ల అప్పు చేసి ఒక్క నూతన ప్రాజెక్టు ప్రారంబించలేదన్నారు. కమీషన్లు తీసుకుంటూ అప్పులు తెచ్చి కాంట్రాక్టర్ల జేబులు నింపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్ సింగ్, శ్రీధర్ సాగర్, కృష్ణ దాస్, చంద్రకాంత్, మసూద్, సంతోష్, అంబటి శ్రీనివాస్, రాములు, జగదీష్ యాదవ్, గోవింద్ సింగ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.