హైదరాబాద్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పీఏ సతీశ్‌రెడ్డి వ్యవహారంపై మంగళవారం హైడ్రామా నడిచింది. ఆయన అక్రమంగా రూ.40 కోట్లు వసూలుచేసి పరారయ్యారంటూ ఉదయం నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో బయటికొచ్చిన పీఏ సతీశ్‌రెడ్డి ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్ నుంచి ప్రకటనను విడుదల చేశారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానని ప్రకటించారు. రాజగోపాల్‌రెడ్డి వద్ద 16 ఏండ్లుగా పనిచేస్తున్నానని, ఆయనకు గానీ, తన కుటుంబానికి గానీ మచ్చతెచ్చే పని చేయబోనని స్పష్టంచేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు.